మంచిర్యాల, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్లలో రూ.1.39 కోట్ల అవినీతికి పాల్పడిన కేసు విచారణలో విఫలమయ్యారంటూ శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేయగా, స్థానికంగా చర్చనీయాంశమవుతున్నది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులు, రామారావుపేట గ్రామంలోని సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లు యాజమానులు డీలర్ శ్రీనివాస్, ఆయన కుమారుడు సాయి తమకు తెలిసిన 8 మందిని రైతులుగా చూపించి, వారి నుంచి 322.6 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేశారు. ఈ మేరకు ధాన్యానికి మద్దతు ధరగా వచ్చే రూ.1.39 కోట్లను తమ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సదరు రైస్ మిల్లు యాజమానులు, డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకుడు, 8 మంది రైతులుగా ఉన్న వ్యక్తులు, వారికి సహకరించిన మండల వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ విస్తరణ అధికారి, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఇలా అందరినీ కలుపుకొని 13 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రైస్ మిల్లు యాజమాని కుమారుడు సాయిని కేసు నమోదైన రెండు రోజులకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును విచారిస్తున్నామని, మిగిలిన 12 మందిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపామని చెప్పారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య అరస్టై 24 గంటలు కూడా పూర్తికాకుండానే సాయి బెయిల్‌పై బయటికి వచ్చారు.
అవినీతి జరిగిందని నిగ్గు తేల్చిన అధికారులు కేసులో ఏ-3గా ఉన్న సాయికి ఒక్కరోజులోనే బెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది. ముందు నమోదు చేసిన కేసులు నాన్ బెయిలెబుల్ అంటూ ప్రచారం జరిగినా.. అరస్టైన మరుసటి రోజే నిందితుడు బయటికి రావడం ఏమిటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అనంతరం మిగిలిన 12 మందిలో చెన్నూర్‌కు చెందిన ఓ వ్యక్తిని రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పటికే ఆయనకు సైతం బెయిల్ వచ్చింది. ఆయనతో ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న డీలర్ శ్రీనివాస్ సహా రైతులుగా చూపించిన 8 మందికి, అవినీతి జరిగిన డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకుడికి సైతం బెయిల్ మంజూరైంది.
ఎవరినీ అదుపులోకి తీసుకొని విచారించకుండానే నిందితులకు బెయిల్ రావడంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో కేసు నమోదు చేసి విచారిస్తున్న సీఐ కఠినమైన చర్యలు తీసుకోకుండా, నిందితులు బెయిల్‌కు వెళ్లినప్పుడు కోర్టులో ప్రాపర్ కౌంటర్ వేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించిన కారణంగా ఆయనను సస్పెన్షన్ చేసినట్లు తెలిసింది. కాగా, అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్ డీలర్ శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమారుడు సాయి, బంధువులను కేసు నుంచి తప్పించేందుకు సీఐ సహకరించారని, అందుకే ఆయన్ని సస్పెండ్ చేశారన్న ప్రచారం జరుగుతున్నది.
రూ.1.39 కోట్ల అవినీతిపై సుమారు వారం, పది రోజుల పాటు విచారణ జరిగింది. విజిలెన్స్ విచారణ సాగిన తీరుపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు సైతం వచ్చాయి. రెండు, మూడు రోజుల్లో బాధ్యులపై కేసు నమోదు అవుతుందని సమాచారం బయటికి వచ్చింది. కాగా, ఇందులో కీలక సూత్రదారులుగా ఉండి నిందితులకు సహకరించిన మండల వ్యవసాయ అధికారికి సరిగ్గా ఇదే సమయంలో రెండు నెలలు లాంగ్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. విచారణ జరిగి, సరిగ్గా మూడు రోజుల్లో కేసు నమోదు అవుతుందనగా ఆయన లీవ్ అడగడం, ఉన్నతాధికారులు మంజూరు చేయడం ఏమిటన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు వినికిడి.
ఏవోతో పాటు ఏఈవో సైతం లీవ్‌లో వెళ్లిపోయారు. అవినీతి కేసులో మండల అధికారుల పాత్ర ఉందని తెలిసి వారికి సెలవులు మంజూరు చేయడం వెనుక మతలబేమిటన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నింధితులకు బెయిల్ వచ్చినప్పటికీ మండల ఏవో, ఏఈవోలకు మాత్రం బెయిల్ రాలేదని తెలిసింది. వారిపై నాన్ బెయిలెబుల్ సెక్షన్లు నమోదు చేశారని తెలిసింది. మరి అధికారులకు నాన్ బెయిలెబుల్ వర్తించినప్పుడు, ప్రధాన నిందితులకు అది ఎందుకు వర్తించలేదు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీస్ శాఖ అధికారులు బెయిల్ వచ్చేందుకు పరోక్షంగా సహరించారని, అదే ఇప్పుడు సీఐ సస్పెన్షన్ దాకా వెళ్లిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యవసాయ అధికారుల పాత్రపైనా పోలీసులు కూపీ లాగుతుండడంతో ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కొందరు ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే నిందితులకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో రానున్న రోజుల్లో పోలీస్ అధికారులు ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.