మంచిర్యాల ప్రతినిధి(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 15 : మంచిర్యాల జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చిట్‌ఫండ్ సంస్థలు జనాలను ‘చీట్’ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. రిజిస్టర్డ్ సంస్థలని చెప్పుకుని పెద్ద కార్యాలయాలు తెరుస్తూ, అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పుకుంటు బురిడీ కొట్టిస్తున్నాయి. ఇటీవలే కనకదుర్గ చిట్‌ఫండ్ బోర్డు ఎత్తేసింది. దీనిలో డబ్బులు పెట్టిన చాలా మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా పని చేసిన చెన్నూర్ వ్యవసాయశాఖ ఏడీఏ భార్య ఫర్టిలైజర్ షాపుల యజమానులతో భారీగా చిట్టీలు కట్టించిన విషయం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.
ఫర్టిలైజర్ షాపుల యజమానులతోపాటు వ్యవసాయశాఖలో పని చేస్తున్న అధికారులతో కూడా చిట్టీలు వేయించి మోసం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది కనకదుర్గ చిట్‌ఫండ్‌తోపాటు వివిధ చిట్‌ఫండ్స్‌లో చిట్టీలు వేసి మోసపోయారు. ఇంటి నిర్మాణం, బిడ్డల పెండ్లి, చదువు, ఆపరేషన్ల కోసం అని చిట్టీలు వేసి యాక్షన్ అయ్యాక డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటున్నట్లు చెప్తున్నారు. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల షూరిటీలు పెట్టించి, ప్రభుత్వ ఉద్యోగులమై ఉండి ఎత్తుకున్న చిట్టీ డబ్బుల కోసం నెలల తరబడి చిట్‌ఫండ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని వాపోతున్నారు. కొన్ని సంస్థల నిర్వాహకులు డబ్బుల కోసం తిప్పించుకుంటుంటే మరికొన్ని సంస్థల నిర్వాహకులు పారిపోతున్నారు.
అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పుకుని సంస్థలో పని చేయడానికి స్థానికంగా మేనేజర్లు, సిబ్బంది, ఏజెంట్లను నియమించుకుని వాళ్లకున్న పరిచయస్తులతో చిట్టీలు వేయించి దందా చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడి నుంచో వచ్చిన కంపెనీ స్థానికులను బకరాలను చేసి వెళ్లిపోతున్నాయి. సకాలంలో డబ్బులు వసూలు చేస్తున్న సంస్థలు, చిట్టీ యాక్షన్ చేసిన వారికి డబ్బులు ఇచ్చే విషయంలో మాత్రం తీవ్రమైన జాప్యం చేస్తున్నాయి. చిట్స్‌లో సభ్యులుగా చేర్పించిన ఏజెంట్లు స్థానికులు కావడంతో బాధితులు వారిని పట్టుకుని తమకు డబ్బులు ఇప్పించాలని గొడవకు దిగుతున్నారు. చిట్‌ఫండ్స్ పేరిట కార్పొరేట్‌ను తలపించే కార్యాలయాలను తెరిచి చాలా మందిని నమ్మించి చిట్టీలు వేయిస్తున్నారు.
అలా వచ్చిన డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడంతో చిట్స్ తీసుకున్న వారికి సకాలంలో డబ్బులు అందడం లేదు. చిట్టీలు వేసిన వారి నుంచి చిట్టీ లేపిన వారి నుంచి డబ్బులు వసూలు క్రమం తప్పకుండా చేస్తున్నారు. లీగల్‌సెల్, రికవరీ సెల్ పేరిట బృందాలుగా వెళ్లి బెదిరించి వసూలు చేస్తున్న సంస్థలు చిట్టీలో మిగిలిన వారికి డబ్బులు ఇవ్వడానికి చుక్కలు చూపిస్తున్నారు. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీలు తీసుకుని నాలుగైదు నెలలు గడిచినా ఇవ్వకుండా.. కొందరు తప్పించుకుంటుంటే, మరికొందరు సంస్థ నష్టాల్లో ఉంది, హెడ్ ఆఫీసుకు వెళ్లాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో ఆయా కార్యాలయాల్లో ప్రతి రోజు గొడవలే దర్శనమిస్తున్నాయి.
మధ్యవర్తులు, యాజమాన్యం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. దీంతో రోజు చిట్టీ డబ్బుల కోసం వచ్చి గొడవ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా చిట్స్ నిర్వహిస్తూ అమాయకులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాల విషయంలో అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మంచిర్యాల జిల్లాలో దాదాపు 15 నుంచి 20కి పైగా చిట్‌ఫండ్ సంస్థలు బోర్డు తిప్పేశాయి. గడిచిన కొన్నేళ్లలో అక్షర, సాయి గీతం, శుభనందిని, అచల, భవ్యశ్రీ, సురభి, చిట్ల, కనకదుర్గ లాంటి చిట్‌ఫండ్ సంస్థలు చేతులు ఎత్తేశాయి. దీంతో లక్షల రూపాయలు రావాల్సిన బాధితులు ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు.
మా మరిది వైద్యానికి అవసరం అవుతాయని మంచిర్యాలలోని మహా గణపతి చిట్‌ఫండ్‌లో రూ.10 లక్షల చిట్టీ వేసినా. ముందు మూడు నెలల్లో చిట్టీ ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. వాయిదాలు పెంచుకుంటూ పోయి ఏడు నెలలకు తీసుకుపోయారు. పోయిన సంవత్సరం అక్టోబర్‌లో చిట్టీ యాక్షన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. ప్రతి నెలా కట్టే కిస్తీ డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీ ఇచ్చినప్పటికీ ఐదు నెలల నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. మధ్యలో ఒకసారి రూ.3.50 లక్షల చెక్ ఇచ్చారు. కానీ.. అది బ్యాంక్‌లో వేద్దామని వెళ్లే ఆ అకౌంట్లో డబ్బులు లేవు. ఈ చెక్ వేస్తే బౌన్స్ అవుతుందని బ్యాంక్ వాళ్లు చెప్పారు. ఇప్పుడేం చేయాలే అర్థం కావడం లేదు. ఫోన్ చేస్తే సదరు చిట్‌ఫండ్ నిర్వాహకులు, ఉద్యోగులు ఎవరూ స్పందించడం లేదు. – ఫర్జానా బేగం, డీడబ్ల్యూవో కార్యాలయ ఉద్యోగి.
ఏ చిట్టీ వేసినా ష్యూరిటీలు ఇచ్చిన నెల రోజులకు డబ్బులు ఇవ్వాలి. లేని పక్షంలో టీ చిట్స్ యాప్‌లో సిటీజన్ కార్నర్ అనే ఆప్షన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. అప్పుడు మేము సదరు చిట్‌ఫండ్‌ను డీటైల్ రిపోర్ట్ అడుగుతాం. వారం, పది రోజుల్లో వాళ్లు స్పందించకుంటే జిల్లా రిజిస్ట్రార్ దగ్గర ఆర్బిట్రేషన్ ఫైల్ చేయాలి. లేదా వినియోగదారుల ఫోరంలోనైనా కేసు వేయాలి. ఇది ప్రాసెస్. నెల రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి. కానీ.. చాలా వరకు చిట్‌ఫండ్ కంపెనీలు కస్టమర్లను నమ్మిస్తున్నాయి. ఆ మాటలు నమ్మి వీళ్లు మోసపోతున్నారు. అంతా అయ్యాక మా దగ్గరికి వస్తే ఏం చేయలేం. నెల రోజుల్లో డబ్బులు రాలేదా.. ఫిర్యాదు చేసుడు ఒక్కటే మార్గం.
– రామరాజు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చిట్ రిజిస్ట్రార్