నస్పూర్/ఆసిఫాబాద్ టౌన్, జూన్ 6 : ఈ నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, టీజీపీఏ రవి గుప్తాతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ ఈ నెల 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న గ్రూప్-1 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం పరీక్షకు సంబంధిత పత్రాలు, సామగ్రి స్ట్రాంగ్‌రూంలకు చేరవేశామని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్‌రూం నుంచి పరీక్ష కేంద్రాలకు తరలించడంతో పాటు పరీక్ష ముగిసిన తర్వాత హైదరాబాద్ పంపించే సమయంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు జిల్లాల వారీగా సమకూర్చడం జరిగిందని, రైతులకు ఇబ్బంది కలగకుండా పంపిణీ చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలన్నారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందించాలన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు కలెక్టర్ బదావత్ సంతోష్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్లు రాహుల్, దీపక్ తివారీ, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వరరావు, మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, డీఈవో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్రావు, ప్రాంతీయ సమన్వయకర్త చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.