తాండూర్ : విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని మండల విద్యాధికారి ఎస్ మల్లేశం అన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు పోటీలు ఎంతగానో దోహదపడుతాయని పేర్కొన్నారు.
మంచిర్యాల ( Mancheriyal) జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అధ్వర్యంలో అండర్- 14,17 చెస్ ( Chess competitions ) బాలురు, బాలికల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల జోనల్ స్థాయి ఎంపిక పోటీలు గురువారం తాండూర్ మండల కేంద్రంలోని విద్యాభారతి హైస్కూల్లో నిర్వహిం చారు. ఈ ఎంపిక పోటీలకు ముఖ్యఅతిధిగా ఎంఈవో ఎస్ మల్లేశం, సభ అధ్యక్షుడిగా పోటీల కన్వీనర్, పాఠశాల కరస్పాండెంట్ సురభి శరత్ కుమార్ హాజరై మాట్లాడారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను పెంపొందించడానికి పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. శరత్ కుమార్ మాట్లాడుతూ పోటీల్లో గెలుపు ఓటములు సహజమేనని ఓడిన వారు నిరుత్సాహపడకుండా విజయం వైపునకు దృష్టి పెట్టాలన్నారు. జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో కూడా పాల్గొని ఉమ్మడి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కొనియాడారు. ఈ పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఎంపికైన క్రీడాకారులు జగిత్యాల జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ టోర్నమెంట్లో పాల్గొంటారని క్రీడా సమాఖ్య ప్రతినిధి, ఎస్ జీ ఎఫ్ సెక్రటరీ ఎండీ యాకూబ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాఠశాల ఆకాడమీ డైరెక్టర్ సౌమ్య, ప్రిన్సిపాల్ సరోజినీ, పోటీల పరిశీలకురాలు కల్పన, ఎస్జీఎఫ్ అదిలాబాద్, అసిఫాబాద్ సెక్రటరీలు స్వామి, వెంకటేష్, నిర్వాహక కార్యదర్శులు, పీఈటీలు బాలకృష్ణ, రాజు, తారకేశ్వరి, వ్యాయామ ఆపాధ్యాయులు నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.