భీమారం, సెప్టెంబర్ 28 : ‘70 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నం. ఇప్పుడచ్చి చెరువులో మా ఇండ్లున్నయంటున్నరు. గవ్విటిని కూల్చుతమని నోటీసులిచ్చిన్రు. కాల్మొక్తం. కనికరించి.. మాకు న్యాయం చేయుండ్రి’ అంటూ మంచిర్యాల జిల్లా భీమారం మండలం సుంకరిపల్లి గ్రామస్తులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కాళ్లపై పడ్డారు. శనివారం భీమారంలోని రైతు వేదిక వద్ద వివేక్ అధికారులతో కలిసి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ప్రొసీడింగ్‌లతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
భీమారానికి చెందిన 40 మంది చిరువ్యాపారులు కూడా అక్కడికి చేరుకొని తమ గోడు వెల్లబోసుకున్నారు. చెరువు శిఖంలో కట్టడాలున్నాయని తమకు నోటీసులిచ్చారని.. న్యాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఇంతలోనే అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కలగజేసుకొని పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇలా తప్పుదోవ పట్టిస్తే కలెక్టర్‌కు నేనేమీ చెప్పాలన్నారు. ఇంతలోనే బాధితులు మాట్లాడేందుకు యత్నించగా, ఎమ్మెల్యే స్పందిస్తూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ల అన్నకే నోటీసులు ఇచ్చారని ఛీదరించుకున్నారు.
ఈ క్రమంలో ఓ అగ్రవర్ణ కాంగ్రెస్ నాయకుడు సుంకరపల్లి దళిత మహిళలను వివేక్ కాళ్లు మొక్కాలని ప్రోత్సహించాడు. బాధితులకు న్యాయం చేయాలని పోడెటి రవితో పాటు మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్ నాయక్ వర్గం ప్రయత్నం చేస్తుండగా, కాంగ్రెస్ జిల్లా నాయకుడు చేకూర్తి సత్యనారాయణ రెడ్డి వర్గం మాత్రం చెరువును కబ్జాల నుంచి కాపాడాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కల్పన, ఎంపీడీవో మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ మూర్తి, కాంగ్రెస్ నాయకులు కోట రవి, బానోత్ విజయ్ నాయక్, కొక్కుల నరేశ్, శ్యాం సుందర్, తదితరులు పాల్గొన్నారు.