“నేను తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డను.. 14 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసినోడ్ని.. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా, గతంలో ఐదేళ్లు పార్లమెంట్ సభ్యుడిగా నిస్వార్థంగా ప్రజాసేవకే అంకితమైన. కేసీఆర్ శిష్యుడిగా.. కేసీఆర్ సైనికుడిగా చెన్నూర్ నియోజకవర్గ ప్రగతికి నిరంతరం కృషి చేసిన. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నవాళ్లు ఏం చేశారో… నేను ఎమ్మెల్యే అయ్యాక ఏం జరిగిందో.. బేరీజు వేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఈ పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించండి. రాబోయే రోజుల్లో మేం చేయబోయే కార్యక్రమాలను మా మ్యానిఫెస్టోలో చూసి నమ్మాలి. మంచిగా ఆలోచించి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేయండి. ఎమ్మెల్యేగా నన్ను, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించండి.” అని చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆయన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
– మంచిర్యాల, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ సైనికుడిగా చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఈ పదేళ్లలో చేసిన ప్రగతి, చేపట్టిన సంక్షేమ పథకాలేమిటో ప్రజలకు తెలుసని, ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించామని తెలిపారు. అంతకుముందు పాలించినోళ్లు చెన్నూర్‌కు చేసిందేమీ లేదని, నేను సున్నా నుంచి మొదలుపెట్టి దాదాపు 90 శాతం పనులు చేశానని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే ఇక్కడ.. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా.. అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని వివరించారు. నవంబర్ 7న మందమర్రిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నమస్తే తెలంగాణ : ప్రస్తుతం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో
బాల్క సుమన్ : మంచిర్యాల జిల్లాలో మాకు సానుకూలమైన వాతావరణం ఉంది. మంచిర్యాల జిల్లా కావాలనేది ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ. దానిని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. బెల్లంపల్లి, చెన్నూర్లను రెవెన్యూ డివిజన్లు చేశారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కన్నేపల్లి, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భీమారం, అస్నాద్, పారుపల్లి, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హజీపూర్లాంటి కొత్త మండలాలు చేశారు. లక్షెట్టిపేట, నస్పూర్, క్యాతన్‌పల్లి, చెన్నూర్లాంటి కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. ప్రభుత్వ ఫలాలు ప్రజల ఇంటి ముందుకు వచ్చాయి. ఇది ఒకటైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించాం.
కరెంట్ సమస్య తీరింది, మంచినీళ్ల బాధ పోయింది, సాగునీళ్ల ఇబ్బందులు పోతా ఉన్నయ్. సంక్షేమం కూడా గతంలో ఎన్నడూ లేనట్లుగా జరిగింది. ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీబంధు, కులవృత్తులకు చేయూత.. ఇలా రకరకాల కార్యక్రమాలతో ప్రజలకు ప్రభుత్వం బాగా చేరువైంది. జిల్లాలో ఇటు అభివృద్ధి కార్యక్రమాల పరంగా, అటు సంక్షేమ పథకాల పరంగా చూసుకున్నా మా ప్రభుత్వంపై సానుకూలత ఉంది.
నమస్తే : సాగునీటి విషయంలో చెన్నూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా జరిగిన మేలు ఏదైనా ఉందా?
బాల్క సుమన్ : మా చెన్నూర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు కాళేశ్వరం జలాలు ఇచ్చే చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని రూ.1,658 కోట్లతో ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే పడ్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని హజీపూర్ మండలానికి, గూడెం లిఫ్ట్ ద్వారా లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు, కడెం కిందున్న ఆయకట్టును స్థిరీకరించి కొన్ని ప్రాంతాలకు నీరు ఇస్తున్నాం. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి అటు వార్ధా నది నుంచి 55 వేల ఎకరాలకు నీళ్లు తీసుకువచ్చే పని కూడా జరుగుతా ఉంది. మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వచ్చింది.
ఇలా అనేక రకాలైన పెండింగ్ పనులు చాలా వరకు పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఎమ్మెల్యేలుగా మేం కూడా మంచిగ పని చేస్తున్నామన్న భావన ప్రజల్లో ఉంది. కాబట్టి జిల్లాలో మూడింటికి మూడు సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే సంపూర్ణమైన నమ్మకం మాకు ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఇప్పటి వరకు మేం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలకు చెప్పుకుంటూ ఓట్లు అడుగుతున్నాం. ముఖ్యంగా రైతు బీమా లాగా తెలంగాణ ప్రజలందరికీ రూ.5 లక్షల కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా.. తెల్ల రేషన్ కార్డుల హోల్డర్లకు సన్న బియ్యం అందించే అన్నపూర్ణ పథకం, మహిళలకు రూ.3 వేలు ఇచ్చే సౌభాగ్య లక్ష్మి, రైతుబంధు రూ.16వేలకు పెంచడం, ఆసరా పింఛన్లు రూ.5 వేలు, దివ్యాంగుల పింఛన్లు రూ.6 వేలు చేయడం, రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలాంటి మంచి కార్యక్రమాలు మ్యానిఫెస్టోలో ఉన్నయ్. వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం.
నమస్తే : మీరు ఎమ్మెల్యే కాకముందు ఉన్న చెన్నూర్, మీరు వచ్చాక మారిన చెన్నూర్ గురించి మీ మాటల్లో..
బాల్క సుమన్ : చెన్నూర్ మారుమూల నియోజకవర్గం, రాష్ట్ర రాజధానికి రూ.280 నుంచి 300 కిలోమీటర్ల
దూరంలో ఉంది. ఇక్కడ రోడ్ నెట్వర్క్ గానీ, బ్రిడ్జిలు గానీ లేవు. నా హయాంలో 22 కొత్త బ్రిడ్జిలు నిర్మించాం. తుంతుంగ వాగుమీద రూ.8 కోట్లతో, సుద్దాల వాగు మీద రూ.15 కోట్లతో, సుబ్బరాంపల్లి వాగు, గంగారం దగ్గర, భీమారం మండలం పోతన్‌పల్లి, కిష్టంపేట దగ్గర కొత్త బ్రిడ్జిలు కట్టినం. అన్నింటికంటే ముఖ్యంగా గతంలో ఎవ్వరూ కూడా చేయని విధంగా చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేశాం.
జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి గ్రామాలకు, వివిధ గ్రామాల్లో ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశాం. అవేగాకుండా మందమర్రి, చెన్నూర్, క్యాతన్‌పల్లి మూడు మున్సిపాలిటీలకు సుమారు రూ.700 కోట్ల పైచిలుకు నిధులు తెచ్చాం. మూడు మున్సిపాలిటీల్లో సెంట్రల్ లైటింగ్ పనులు, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం, పార్కులు, బతుకమ్మ గ్రౌండ్లు, కేసీఆర్ మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చెన్నూర్ టౌన్లో 50 పడకల ఆసుపత్రి, కొత్తగా రూ.40 కోట్లతో వంద పడకల ఆసుపత్రి, రూ.4 కోట్లతో బస్సు డిపో ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం వచ్చాక చేశాం.
అదే కాకుండా చెన్నూర్ రెవెన్యూ డివిజన్ కానివ్వండి, అస్నాద్, పారుపల్లి, భీమారంలాంటి మండలాలు కానీ, చెన్నూర్ ఎత్తిపోతల పథకం కానీ, రూ.500 కోట్లతో మందమర్రి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానీ.. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెన్నూర్‌లో జరుగుతున్నాయ్. ఈ మూడు, నాలుగు రోజుల్లో చెన్నూర్ ప్రగతి నివేదిక సైతం విడుదల చేస్తాం. దానిలో విద్యుత్ రంగంలో, నీటి పారుదల రంగంలో, వ్యవసాయ రంగంలో, సంక్షేమ రంగంలో మేం చేసిన కార్యక్రమాలన్నీ వివరించబోతున్నాం. ముఖ్యంగా 29వేల పైచిలుకు మందికి ప్రతి నెలా రూ.6.68 లక్షల పింఛన్లు వస్తున్నాయి. ఏడు వేల పైచిలుకు ముందికి మేం కల్యాణలక్ష్మి/షాదీముబారక్ కింద రూ.లక్ష ఇచ్చాం. కేసీఆర్ కిట్ కింద 9వేలపై చిలుకు మందికి లబ్ధి చేకూర్చినం. 45వేల మందికి పది విడుతల్లో దాదాపు రూ.505 పైచిలుకు కోట్ల రైతబుంధు ఇచ్చినం. రైతుబీమా 45 కుటుంబాలకు ఇచ్చినం. ఇలా చాలా కార్యక్రమాలు చేశాం. వాటన్నింటినీ త్వరలో చెన్నూర్ ప్రగతి నివేదిక రూపంలో ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం.
బాల్క సుమన్ : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని పనులు చేశాం. మన ఊరు-మన బడిలో భాగంగా మొదటి విడుతలో 74 స్కూళ్లు బాగైనయ్. మిగితా స్కూల్స్‌ను బాగు చేసుకోవాల్సి ఉంది. కొన్ని చోట్ల కొత్త అంగన్వాడీ బిల్డింగ్లు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల అవసరం ఉంది, కొన్ని కొత్త గ్రామ పంచాయతీలకు బిల్డింగ్లు చేసుకోవాల్సి ఉంది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయాల్సి ఉంది. అవన్నీ కూడా రానున్న రోజుల్లో పూర్తి చేసుకుంటాం. అంతకుముందు పాలించినోళ్లు చెన్నూర్‌కు చేసింది. సున్నా.. నేను సున్నా నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం. నా హయాంలో దాదాపు నియోజకవర్గంలో 90శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకో పది శాతం అక్కడక్కడా రోడ్ల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం ఇతరాత్ర పనులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నాం.
బాల్క సుమన్ : ఎవరు పోటీ చేసినా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలు. ప్రజల నిర్ణయం కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నా. గతంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసిన వారందరూ వాళ్ల హయాంలో ఏం చేశారు. ఏం చేయలేదు అనేది ప్రజల ముందు ఉన్నది. ఈ రోజు నా టర్మ్‌లో కరోనా వచ్చి రెండు సంవత్సరాలు ఇబ్బందైనా, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా, పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగినా నేను ఎన్ని నిధులు తీసుకువచ్చిన, ఎంత అభివృద్ధి చేసినా అనేది ప్రజల ముందు ఉంది.
ఎవ్వరొచ్చి పోటీ చేసినా, ఏ పార్టీ పోటీ చేసినా చెన్నూర్ ప్రజలకు వాళ్లు చేసింది, చేయబోయేది ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా పోటీ చేసుకోవచ్చు. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను నేను ఒక్కటే కోరుతున్నా.. గడిచిన ఐదు దశాబ్దాల పైచిలుకు కాలంలో చాలా మంది ఎమ్మెల్యేలను మీరు చూశారు. ఇక్కడి నుంచి మంత్రులుగా ఉన్న వారిని కూడా చూశారు. వాళ్ల హయాంలో జరగనటువంటి చాలా పనులు ఇవాళ మనం చేసుకున్నాం. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే, ఈ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఇట్లనే కొనసాగాలంటే కచ్చితంగా ఇక్కడ బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉండాలే. అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలే.
బాల్క సుమన్ : చెన్నూర్‌కు బస్సు డిపో కావాలన్నది కొన్నేళ్ల కల. మొన్న మనం చేసినం. చెన్నూర్ రెవెన్యూ డివిజన్ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటున్నరు. అది గత పాలకుల హయాంలో కాలేదు. ఇప్పుడు మనం చేసినం. అదే విధంగా చెన్నూర్‌లో అస్నాద్, కోటపల్లిలో పారుపల్లి మండలం కావాలన్న ప్రజల ఆకాంక్షలన్నింటినీ మనం నెరవేర్చినం. సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వాలనే ప్రజల కోరిక మేరకు రామకృష్ణాపూర్లో నాలుగువేల కుటుంబాలకు పట్టాలు ఇప్పించాం. క్యాతన్‌పల్లి ఆర్వోబీ నిర్మాణం, మందమర్రి ఆర్వోబీ నిర్మాణం, వాగులు, వంకలపై బ్రిడ్జిల నిర్మాణం చాలా పనులు మనం చేసినం.
గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల ప్రజలు వరదలు వచ్చినప్పుడు భూములు మునుగుతున్నాయ్ అన్నరు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పాను. అసెంబ్లీలో మాట్లాడాను. మొన్న మంత్రి హరీశ్‌రావు చెన్నూర్‌కు వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి కరకట్టలు కట్టడమా, రైతుల భూములను నష్టపరిహారం ఇచ్చి తీసుకోవడమా ఏదో ఒకటి శాశ్వత పరిష్కారం చూస్తామని వేలాది మంది ప్రజల సమక్షంలో చెన్నూర్ గడ్డమీదే మాట ఇచ్చారు. కచ్చితంగా ఇప్పటికే చాలా చేసినం, ఇంకా మిగిలిన ఒకటీ, రెండు పనులుంటే వాటని కూడా ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో కచ్చితంగా పూర్తి చేసుకుంటాం. ఈ సందర్భంగా నేను చెన్నూర్ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా నవంబర్ 7న మందమర్రిలో కేసీఆర్ బహిరంగ సభ, ప్రజా ఆశీర్వాద సభ ఉంది. దానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. అంతిమంగా ఇంకేమైనా అపరిష్కృత సమస్యలుంటే ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పూర్తి చేసుకుందాం. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్..