కోటపల్లి, నవంబర్ 7 ; మందమర్రిలో మంగళవారం నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల నుంచి ప్రజలు, శ్రేణులు ఉప్పెనలా తరలిరాగా, సభా ప్రాంగణం జన జాతరను తలపించింది. కటౌట్లు.. జెండాలు.. ఫ్లెక్సీలతో పట్టణం గులాబీమయమైంది. 40 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే.. అవి సరిపోక టెంట్ల కింద, గ్రౌండ్ చుట్టుపక్కల.. చెట్ల కింద నిల్చోవాల్సి వచ్చింది. ఉదయం 10 గంటల నుంచే జనాల రాక మొదలుకాగా.. ఒంటి గంటకు సభా ప్రాంగణం కిటకిటలాడింది. సీఎం కేసీఆర్ వేదికపైకి రాగానే.. జనం చూసేందుకు ఎగబడ్డారు.
ఆయన మాట్లాడుతున్నంత సేపు ఉత్సాహంతో విజిల్స్ వేస్తూ.. కేరింతలు కొట్టారు. రైతుబంధు కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా.. ధరణి ఉండాలా.. వద్దా అని అడగ్గానే అందరూ కావాలంటూ చేతులెత్తి మద్దతు తెలిపారు. ఎలక్షన్లలో పార్టీలు మారి సూట్ కేసులతో వచ్చే వాడు కావాలా.. అభివృద్ధి చేసే సుమన్లాంటి వాడు కావాలా.. అని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు సుమనే కావాలని అద్భుతమైన స్పందన వచ్చింది. సుమన్ నా ఇంట్లో ఉంటడు, నా బిడ్డ లాంటోడు.. భారీ మెజార్టీతో గెలిపించాలి.. అనగానే సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. ఇక రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్, గాయని మధుప్రియ, కళాకారులు ఆటాపాటలతో హోరెత్తించారు. గులాబీల జెండలమ్మా అనే పాటపై.. యువతీయువకులు కండువాలు ఊపుతూ.. నృత్యం చేస్తూ జోష్ నింపారు. జన ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ గెలుపు దాదాపు ఖాయమని స్పష్టమైంది. –