బజార్ హత్నూర్: రైతులు పంటలకు రసాయన ఎరువులను ( Fertilizers ) తక్కువ మోతాదులో వాడి ఖర్చులను తగ్గించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ కే రాజశేఖర్ ( Scientists Rajashekar) తెలిపారు. గురువారం మండలంలోని ధర్మపురి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారులతో కలిసి నిర్వహించారు.
శాస్త్రవేత్తలు రాజశేఖర్, శివ చరణ్ రైతులతో మాట్లాడుతూ విత్తనాలను 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిన తరువాతనే విత్తుకోవాలని సూచించారు. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు, కాయకుళ్లు, సోయాబీన్ ,పంటలో కాండపు ఈగ, పెంకు పురుగు, మొక్కజొన్న పంటలు కత్తెర పురుగు, శనగ లో ఎండు తెగులు, కందిలో మారుకా మచ్చల పురుగు నివారణ చర్యల గురించి రైతులకు వివరించారు.కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ సౌదీ, వ్యవసాయం విస్తరణాధికారి, వెటర్నరీ అసిస్టెంట్, రైతులు పాల్గొన్నారు.