కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ కెరమెరి, జూలై 6 : ఇంతకాలం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని ఓటర్లు రెండేసి ఓట్లు వేస్తూ.. రెండు రాష్ర్టాల సంక్షేమ పథకాలు పొందుతూ రాగా, ఇక ఆ విధానానికి స్వస్తి పలికే రోజు దగ్గరలోనే ఉన్నది. సర్(ప్రత్యేక సమగ్ర సవరణ) విధానంతో ఇక నుంచి ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి వచ్చేస్తున్నది. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంతో ఒక వ్యక్తి.. రెండు ఓట్లు కలిగి ఉండే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తున్నది.
12 గ్రామాల పరిధిలో ప్రక్షాళన
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల సరిహద్దులో ఉన్న వివాదాస్పద 12 గ్రామాల పరిధిలో ‘సర్’ ప్రక్షాళన ఆసక్తికరంగా మారింది. భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటులో భాగంగా అప్పటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ప్రత్యేక రాష్ర్టాల ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కెరమెరి మండలంలోని 12 గ్రామాలు వివాదాస్పదంగా మిగిలిపోయాయి. ఈ వివాదాస్పద గ్రామాలు ప్రస్తుత తెలంగాణతో పాటు అటు మహారాష్ట్రలోనూ నమోదై ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఒక్కొక్కరూ రెండు ఓట్లను కలిగి ఉండడంతో పాటు రెండు రాష్ర్టాల అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పొంపదుతున్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ రెండు రాష్ర్టాల్లో వినియోగించుకున్నారు. ఈ వివాదాస్పద గ్రామాల వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టులో నడుస్తున్న విషయం విదితమే.

సర్‌తో ప్రక్షళన..!
ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ జరుగుతుండగా, వివాదాస్పద గ్రామాల్లోని ఓటర్ల జాబితా ఆసక్తికరంగా మారింది. ఓటర్ లిస్టు సవరణలో భాగంగా అన్ని వివరాలను పరిశీలిస్తున్న అధికారులు ఆధార్‌తో ఓట్లను అనుసంధానం చేస్తున్నారు. దీనిని అనుసరించి ఒకే ఆధార్‌తో ఒకే ఓటు హక్కును వినియోగించే అవకాశమున్నది. దశాబ్ధకాలంగా ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలో జరిగే ప్రతీ ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించే ఈ వివాదాస్పద గ్రామాల ఓటర్లు.. ఇప్పటి నుంచి ఓకే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఓటర్లు
‘సర్’ ప్రక్రియ ద్వారా ఇంతకాలం తాము అనుభవిస్తున్న రెండు ఓట్ల విధానానికి చెక్ పడనుండగా, ఆయా గ్రామాల ఓటర్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రెండు రాష్ర్టాల్లోనూ ఓటు హక్కును కలిగి ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. సర్వే చేసేందుకు వచ్చే తెలంగాణ అధికారులు, వివరాలు తెలుపుతూనే, మరో వైపు మహారాష్ట్ర సర్వే లో పాల్గొంటున్నారు. వివాదాస్పదంగా ఉన్న ప్రతీ గ్రామంలోని ఓట ర్లు రెండు రాష్ర్టాల్లో సగం మంది ఇటు.. మరో సగం మంది మహారాష్ర్టాలో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇటీవల ఆసిఫాబాద్ ఆర్డీ వో లోకేశ్వర్‌రావు, తహసీల్దార్ నాగార్జునతో పాటు మహారాష్ట్ర అధికారులు కూడా పాల్గొని ప్రజలకు ‘సర్’పై అవగాహన కల్పించారు.