తానూర్, ఆగస్టు 20: బెల్ తరోడా గ్రామంలో తల్లి, తండ్రిని కోల్పోయి అనాథగా మారిన 12 ఏళ్ల బాలిక దుర్గకు పలువురు దాతలు అండగా నిలిచారు. తల్లి అంత్యక్రియల కోసం కూతురు దుర్గ భిక్షాటన చేసిందన్న కథనం చదివి సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ చలించి మంగళవారం అనాథ బాలిక దుర్గ ఇంటికి వెళ్లి పరామర్శించి రూ.25వేల చెక్కును అందజేశారు. బాలిక చదువు కోసం ఎల్లప్పుడు సహాయసహాకారాలు అందించడంతో పాటు ఆరోగ్యం కోసం అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. వారి వెంట సమత ఫౌండేషన్ ఆర్గనైజర్ సాహెబ్రావ్, సీఈవో అనిల్, పీఆర్వో క్రాంతి, లక్ష్మణ్, సాయినాథ్పవార్, దేవీదాస్, మధుపటేల్, దేవేందర్, సమత ఫౌండేషన్ సభ్యులు ఉన్నారు.
అనాథ బాలిక దుర్గకు పదో తరగతి వరకు ఉచిత విద్యతో పాటు హాస్టల్లో చేర్చుకుంటామని వికాస్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ నిమ్మ రవీనా అన్నారు. బెల్ తరోడా గ్రామానికి వెళ్లి అనాథ బాలిక దుర్గను కలిసి ఓదార్చి, మనోధైర్యాన్ని అందించారు. ఇక్కడ మాజీ సర్పంచ్ గోప సాయినాథ్, వికాస్ స్కూల్ కరస్పాండెంట్ రత్నశేఖర్, ప్రిన్సిపాల్ గాంధారి రాజన్న, ఉపాధ్యాయులు ఉన్నారు.
నిర్మల్ అర్బన్, ఆగస్టు 20 : తానూర్ మండలం బెల్ తరోడా గ్రామానికి చెందిన దుర్గ తల్లి ఇటీవల మరణించి అనాథగా మారడంతో నిర్మల్‌కు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులు అండగా నిలిచారు. మంగళవారం చిన్నారిని పరామర్శించి రూ.12 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దుర్గకు ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు వరదెల్లి మహేశ్, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.