తాండూర్ : యూరియా సరఫరా ( Urea Supply ) విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి ( Suram Ravinder) , మండల అధ్యక్షుడు ఎండీ ఈసా ప్రశ్నించారు . గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు .
ఖరీఫ్ ( Khariff ) సాగు ప్రారంభం నుంచి రాష్ట్రానికి అవసరమైన యూరియా కోటాను సరఫరా చేయకుండా కేంద్రం తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. యూరియా సరఫరాపై రాష్ట్ర మంత్రులు , ఎంపీలు పలుమార్లు కేంద్రానికి నివేదించినప్పటికీ పట్టింపు లేకుండా వ్యవహరించడం రైతులపై వారికున్న చిత్తశుద్ధికి అద్ధం పడుతుందన్నారు.
బీజేపీ నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడానికి ధర్నాలు, రాస్తారోకోలు నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు . రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు , ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్ రావు, గట్టు మురళి, సిరంగి శంకర్, సాలిగామ బాణయ్య పాల్గొన్నారు.