చెన్నూర్, ఫిబ్రవరి 19 : చెన్నూర్‌లో పది రోజులకుపైగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. నిత్యం తెల్లవారు జామున జిన్నింగ్ మిల్లుల వద్దకు చేరుకోవడం.. తీరా కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. కేసీఆర్ సర్కారులో రంది లేకుంట పంటలు అమ్ముకున్నామని, ప్రస్తుతం రోజుల తరబడి అవస్థలు పడుతున్నా ఇటు కేంద్రంగాని, అటు రాష్ట్ర ప్రభుత్వంగాని పట్టించుకున్న పాపానపోవడం లేదని కర్షకుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
చెన్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని ఐదు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొద్ది రోజులుగా ఆన్లైన్ లేదనే సాకుతో కొనుగోళ్లకు బ్రేక్ వేసింది. రైతులు రోజుల తరబడి వాహనాల్లో పత్తి పెట్టుకొని పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఇక సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్ వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
సీసీఐ క్వింటాలుకు రూ 7,425 చొప్పున కొనుగోలు చేస్తుండగా, ప్రైవేట్ వ్యాపారులు మాత్రం కొర్రీలు పెడుతూ రూ.6,800లకే కొంటున్నారు. దీంతో రైతులు ప్రతీ క్వింటాలుకు రూ.700 దాకా నష్టపోవాల్సి వస్తున్నది. దీనికితోడు వారిపై వాహనాల వెయింటింగ్ చార్జీలు కూడా అదనంగా పడుతున్నాయి. ఆన్లైన్ రావడం లేదన్న సాకుతూ తమను ఇబ్బందులు పెడుతున్నారంటూ రైతులు నిత్యం ఎక్కడోచోట ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్నా స్పందించే వారే కరువయ్యారు.
మాది హాజీపూర్ మండలం గుడిపేట గ్రామం. లక్షెట్టిపేటలో పత్తి కొంటలేరని చెన్నూర్‌కు వచ్చిన. పది రోజుల సంది ఇక్కడే ఇరుక్క పోయిన. ప్రతిరోజూ అక్కడి నుంచి ఇక్కడికి చార్జీలు పెట్టుకొని వచ్చి పోతున్న. వాహనంలోని పత్తి అన్లోడ్ చేయకపోవడం వల్ల కిరాయి చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. పత్తి అమ్మితే వచ్చే సొమ్మంతా కిరాయిలకే సరిపోతుంది. ఏడాది పాటు కష్టపడితే రూపాయి కూడా మిగిలేటట్లు లేదు.
– సింగతి సత్తన్న, రైతు, గుడిపేట
పత్తి అమ్ముకోవడా నికి అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ప్రైవేట్ వ్యాపారు లకు అమ్ముదా మంటే క్వింటాలుకు రూ. 6,800 ఇస్తున్నరు. రూ. లక్షకు రూ వెయ్యి చొప్పున క్యాష్ కటింగ్ చేస్తున్నరు. ప్రతి రైతు క్వింటాలుకు రూ.700 దాకా నష్టపోవాల్సి వస్తుంది. అంతేగాకుంగా ఈ పది రోజులకు వాహనాల వెయిటింగ్ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇగ రైతుకు ఏం మిగిలినట్లు. రైతుల గోస ఎవ్వరికీ పట్టడం లేదు.
– ఆకుల రాజయ్య, చింతలపల్లి
సీసీఐకి పత్తి అమ్ముకుందామని పది రోజుల కింద ఇక్కడికి వచ్చిన. పత్తి మిల్లు వద్ద వాహనాన్ని క్యూలైన్లో పెట్టినం. తీరా సమ యానికి ఆన్లైన్ పనిచేయడం లేద ని సీసీఐ అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. ఇగ కొంటరో.. అగ కొంటరో అని ప్రతి రోజూ ఇక్కడికి వస్తున్న. రాత్రి దాకా పడిగాపులు కాసి.. ఇంటికి పోవుడైతంది. ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పట్టించుకున్నోళ్లు లేరు. ఇట్లయితై రైతు బతికేదెట్లా..
– గండ్రకోట లింగయ్య, రైతు, దుగ్నెపల్లి