కౌటాల, ఫిబ్రవరి 25 : సీసీఐ పత్తి కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం సిర్పూర్(టీ) జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. సాంకేతిక లోపాల పేరుతో సీసీఐ పత్తి కోనుగోళ్లు నిలిపివేయడం వల్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వచ్చే నెల 15వ తేదీ వరకూ పత్తి కొనుగోళ్లు చేపట్టాలని, లేదంటే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ సర్కారు ఉంటే ఇప్పటికీ రెండు విడుతలుగా రైతుబంధు అందేదని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతు భరోసారాలేదన్నారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.