మంచిర్యాల, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించి న కాంగ్రెస్ నాయకులపై అధికారులకు కేసులు నమోదు చేస్తున్నా రు. శ్రీరామనవమి రోజున ఓ గుడికి వెళ్లిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రూ.లక్ష విరాళం ఇచ్చిన ఘటనలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, అంతకుముందు రంజాన్ పర్వదినాన ఎమ్మెల్యే పీఎస్సార్ ఈద్గాలోకి వెళ్లి మాట్లాడగా, ‘నమస్తే తెలంగాణ’లో ‘కాంగ్రెసోళ్లకు ఎన్నికల కోడ్ వర్తించదా?’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది.
లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రజాప్రతినిధులు గుడులు, మ సీదులు, చర్చిల్లో ఎలాం టి ప్రసంగాలు చేయకూడదు. కానీ పీఎస్సార్ దీన్ని ఉల్లంఘిస్తూ ఏప్రిల్ 11న మంచిర్యాల ఆండాలమ్మ కాలనీలోగల ఈద్గాలో మాట్లాడడంతో పాటు తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఫ్లయింగ్ స్వాడ్ అధికారులు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం క్లిపింగ్‌తో పాటు వీడియోలను వారికి అందజేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.