వాంకిడి, జూలై 9: అటవీ జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 29న నవేధారి గ్రామానికి చెందిన పూసం కేశవరావు, మండోరె బుర్సా, మాడావి భీమ్రావు, రాంపూర్ గ్రామానికి చెందిన అర్క రమేష్, పెద్ద పుల్లార గ్రామానికి చెందిన మడావి భీం రావులు విద్యుత్ తీగలు అమర్చి వన్య ప్రాణులను హతమార్చేందుకు ఆత్రం తిరుపతిని అటవీకి వెంట తీసుకెళ్లారు. తీగలు అమర్చే సమయంలో కరెంట్ షాక్తో తిరుపతి మృతి చెందాడు. ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా దాచి పెట్టారు. అయితే రెండు రోజుల తర్వాత జనవరి 31న గ్రామ సమీపంలోని గుట్టపై శవమై కనిపించాడు. మామూలుగా మృతి చెంది ఉంటాడని అనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నేర్పించారు.
అయితే, గ్రామానికి చెందిన పలువురు అమర్చిన విద్యుత్ తీగలు తగలడం వల్లే తిరుపతి మరణించాడని ఈ నెల 3వ తేదీన గ్రామస్థులు చర్చించుకోవడంతో ఈ విషయం మృతుడి కుటుంబసభ్యులకు తెలిసింది. ఈ నేపథ్యంలో మృతుడి భార్య సంగీత సోమవారం నాడు వాంకిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో తిరుపతి మృతికి కారణమైన ఐదుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.