మంచిర్యాల, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పెద్దయ్యాక నువ్వు ఏం అవుతా వ్..అని స్కూళ్లో టీచర్ అడిగినప్పుడు డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్, పోలీస్ అని పిల్లలు చెబుతుంటారు. ఇలా డాక్టర్ కావాలనుకునే పిల్లోడి దగ్గరికి ఓ డాక్టర్ వచ్చి తాను ఏం చదివితే ఈ వృత్తిలోకి వచ్చానో చెబితే, కలెక్టర్ కావాలనుకునే విద్యార్థికి ఓ కలెక్టర్ నేరుగా తాను ఎంత కష్టపడితే, ఏం చదివితే కలెక్టర్ అయ్యానో చెప్తే ఎలా ఉంటుంది..? ఆ పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలని కలలు కంటున్నారో దాన్ని సా ధించే ప్రయత్నం చిన్ననాటి నుంచే మొదలవుతుంది. చిన్నతనంలో లక్ష్యసాధనకు అవసరమైన బలమైన పునాది పడుతుంది.
కచ్చితం గా అనుకున్నది సాధించాలనే తపన, ఆరాటం పెరుగుతుంది. సరిగ్గా దీన్నే ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీ రాహుల్. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ‘కెరీర్ గైడెన్స్’ పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి మూడో శనివారం పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. పిల్లల తల్లిదండ్రుల సూచనలను పరిగణలోకి తీసుకొని టీచర్లు పని చేస్తుంటారు. ఈ ప్రోగ్రాం రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ మీటింగ్‌లను విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా మార్చేందుకు అదే రోజున కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా జిల్లాలోని లక్షెట్టిపేటలోని సోషల్ వెల్ఫేర్ హై స్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు దండేపల్లి మండలం వెల్గనూర్ జడ్పీఎస్ఎస్ హై స్కూల్లో నిర్వహించారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అద్భుత స్పందన రావడంతో జిల్లాలోని 18 మండలాల్లో 18 పాఠశాలలను ఎంపిక చేసి డిసెంబర్ 16వ తేదీన తొలి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జనవరి 20వ తేదీన మరో 18 స్కూళ్లలో చేశారు. నెలకు 18 స్కూళ్ల చొప్పున జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు 132 స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్ఐలు, సీఐలు, మెడికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు ‘కెరీర్ గైడెన్స్’ కార్యక్రమానికి హాజరై తాము ఉద్యోగాలు ఎలా సాధించాం.. ఏం చదువుకున్నాం.. పదో తరగతి అయ్యాక ఏ కోర్సుల్లో చేరాం.. ఎలా కష్టపడ్డాం.. అంశాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇలా కెరీర్‌పై స్పష్టతతో విద్యార్థులు ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతున్నది.
పిల్లలు భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యంపై విద్యార్థి దశలోనే స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లాలి. ఆ స్థాయి అవగాహన విద్యార్థుల్లో తీసుకురావడం కోసం తీసుకువచ్చిందే ఈ ‘కెరీర్ గైడెన్స్’. కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తున్నది. మండలస్థాయిలో ఒక గ్రూప్స్ స్థాయి అధికారి, టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన అధికారి, ఇతర పోటీ పరీక్షలు రాసి వచ్చిన అధికారులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని శాఖల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో మిగిలిన హై స్కూల్స్‌లోనూ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం చేస్తాం.
-బీ రాహుల్, మంచిర్యాల అదనపు కలెక్టర్