సోన్, మే 30 : తెల్లరితే మేనల్లుడి పెళ్లి… మంగళవారం పెళ్లి పందిరి.. భార్యాపిల్లలను రెండు రోజుల ముందే అక్క ఇంటికి పంపాడు. వారం రోజులుగా పెళ్లి పత్రికలు బంధువులకు పంచి.. అందరూ మేనల్లుడి పెళ్లికి రావాలంటూ అప్యాయంగా చెప్పి.. మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. కొన్ని నిమిషాల్లోనే మృత్యువు కారు రూపంలో వచ్చి బైక్‌ను బలంగా ఢీకొనింది. ఈ ఘటనలో సోన్ మండలం న్యూవెల్మల్‌లో చోటు చేసుకుంది. గ్రా మస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. సోన్ మండలంలోని న్యూవెల్మల్కు చెందిన చింతకింది గంగాధర్ (42) మాదాపూర్ ఐబీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. కారులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మరో నలుగురు గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
మృతుడు గంగాధర్ మంగళవారం ఉదయం తన బైక్‌పై నిజామాబాద్ జిల్లా సోన్‌పేట్ గ్రామంలో ఉంటున్న అక్క కుమారుడు (మేనల్లుడి) వివాహం బుధవారం నిశ్చయించారు. మేనమామగా అక్షింతలు, ఒడి బియ్యంతో బయలుదేరాడు. సోన్ ఐబీ వద్ద గల పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ బైక్‌లో వేయించుకొని బయలుదేరాడు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన కారు గంగాధర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి కూడా గాయపడ్డారు. వీరిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గంగాధర్ మృతి వార్త తెలియగానే గ్రామంలో, అటు సోన్‌పేట్‌లోని కుటుంబసభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోషం రవీందర్ తెలిపారు.
ఆటో ఢీకొన యువకుడు
దిలావర్పూర్, మే 30 : నిర్మల్-భైంసా 61 జాతీయ రహదారిపై దిలావర్పూర్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుండంపల్లి గ్రామానికి చెందిన గైని గణేశ్ (18) సెల్‌ఫోన్ కోసం బైక్‌పై నిర్మల్‌కు బయలుదేరాడు. దిలావర్పూర్ వద్ద బైక్‌ను ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడిక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.