మంచిర్యాలటౌన్, మార్చి 10 : మంచిర్యాల-అంతర్గాంల మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని రద్దుచేసి, ఆ నిధులను వేరే పనులకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి గోదావరి నదిలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రదేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. బ్రిడ్జి పనుల రద్దు విషయంలో ఎమ్మెల్యే పీఎస్సార్ తన అధికార పలుకుబడిని ఉపయోగించారని, దాంతోనే ఇక్కడ నిర్మించాల్సిన బ్రిడ్జిని రద్దు చేశారని మండిపడ్డారు.
ముందు నుంచి మంచిర్యాలపై ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నారని, అందుకే ఇక్కడ అభివృద్ధి పనులను అడ్డుకుంటూ వస్తున్నాడన్నారు. మంచిర్యాల – అంతర్గాంల మధ్య గోదావరినదిపై వంతెనను నిర్మిస్తే కేవలం రూ. 164 కోట్లతో పూర్తవుతుందని, ఇరుపక్కలా ఇప్పటికే రోడ్లు పూర్తయి ఉన్నాయని, ఈ వంతెన పూర్తయితే పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్‌లకు వెళ్లి, తిరిగి వచ్చే వారికి 36 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అన్నారు. ఒకవైపు ప్రయాణం చేసినా 18 కిలోమీటర్లు తగ్గుతుందన్నారు. కానీ, ఎమ్మెల్యే పీఎస్సార్ మొండిగా వ్యవహరిస్తు ముల్కల, ముర్మూర్ మీదుగా నిర్మించాలనుకుంటున్న వంతెన ద్వారా కేవలం ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే తగ్గుతుందని, పైగా నిర్మాణ వ్యయం రూ. 450 కోట్లు అవుతుందని అన్నారు.
మంచిర్యాల – అంతర్గాంల మధ్య ఇప్పటికే టెండర్ అగ్రిమెంట్, సాయిల్టెస్ట్లు పూర్తయి ఉన్నాయని, పెద్దగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కానీ ముల్కల, ముర్మూర్ మధ్య నిర్మించాల్సిన వంతెన ఇంకా ప్రతిపాదనల్లోనే ఉందని, భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని, దీని ద్వారా ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వం స్పందించి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు అవతలి పక్కనున్న పెద్దపల్లి జిల్లా ప్రజానీకం కోరుకుంటున్న విధంగా ప్రభుత్వం, పాలకులు పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, ప్రజల ఇష్టాలతో పనిలేకుండా తమకు నచ్చిన విధంగా చేసుకోవడం సబబుకాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ, అన్నపూర్ణ, గాదెసత్యం, అంకం నరేశ్, తోట తిరుపతి, శ్రీపతి వాసు, ఎర్రం తిరుపతి, మందపల్లి శ్రీనివాస్, అక్కూరి సుబ్బయ్య, మొగిలి శ్రీనివాస్, కాటంరాజు, తాజుద్దీన్, పెంట ప్రదీప్, రమేశ్‌యాదవ్, మధు పాల్గొన్నారు.