ఆదిలాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ) : “ప్రస్తుత వానకాలానికి రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వడం లేదు. సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగానే వచ్చే పంట కాలానికి అంటే యాసంగి నుంచి పెట్టుబడి సాయం అందిస్తాం.. ఎకరాకు రూ.7,500 చొప్పున పంట వేసిన రైతులకు ఇస్తాం..” అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తేల్చి చెప్పడంపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రహదారులపై భైఠాయించారు. రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ డౌన్.. డౌన్ అంటూ హోరెత్తించారు.
బేల మండలంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రామన్న మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు భరోసా పథకంలో భాగంగా రూ.15 వేలను ఎలాంటి షరతులు లేకుండా ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు సాగు చేసిన రైతులు, రాళ్లు, రప్పలు ఉన్న భూములకు ఇస్తామని చెప్పలేదని అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులు ఇచ్చిన మాట తప్పారన్నారు. వానకాలం ముగిసినా రైతుభరోసా అందలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రికార్డుల ఆధారంగా రైతుబంధు పంపిణీ చేసిందన్నారు. అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లోకి వస్తే రైతుభరోసా విషయంలో నిలదీస్తామన్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లాలో..
వానకాలానికి రైతుభరోసా లేదన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యాఖ్యలపై ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకులు, రైతులు భగ్గుమన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగవేతపై నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామి మేరకు రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుభరోసా ఇవ్వబోమని చెప్పడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ దస్తురాబాద్ మండల శాఖ అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్‌లు డిమండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. ఎగవేసిన వర్షాకాల రైతుభరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుంటాల మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ కుభీర్ మండల అధ్యక్షుడు అనిల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కుభీర్‌లోని పార్డి(బీ) ఎక్స్‌రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతు భరోసా ఎగవేతపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు.