ఖానాపూర్ రూరల్, మే 11 : అడవి సారంగాపూర్ గ్రామస్తులు ఎన్నో ఏళ్లు ఎదురుచూడగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయానికి భవనం మంజూరైంది. భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయానికి భవనం లేక సిబ్బందితో పాటు గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసుల సంక్షేమానికి ఐటీడీఏ శాఖ నుంచి రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీని మంజూరు చేసింది. అప్పుడు కాంట్రాక్టర్ ప్రారంభంలో స్లాబ్ వేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ పనులకు బిల్లులు ఇవ్వకపోగా మధ్యలోనే ఎక్కడిపనులు అక్కడే నిలిచి పోయాయి.
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం దశల వారీగా మండలానికి ఒక్క గ్రామ పంచాయతీని పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఖానాపూర్ మండలంలోని ఆదివాసీ గ్రామమైన అడవి సారంగాపూర్ను ఎంపిక చేశారు. నిరంతరం సంక్షేమ పథకాల అమలు కోసం వస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు నిలబడుదామంటే నీడ లేదని, అయినా గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. సంక్షేమ పథకాల అందించేందుకు, గ్రామ పంచాయతీ కార్యకలాపాలకు కార్యాలయం లేక ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను ఖానాపూర్ మండలంలోని అడవి సారంగాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ మాడావి లింగు భర్త మాడావి జంగుని. మాకు ఐటీడీఏ నుంచి రూ. 20 లక్షల పంచాయతీ భవనం మంజూరైంది. మూడేళ్ల కింద పనులు ప్రారంభించారు. బిల్లులు వస్తలేవని పనులు నిలిపివేశారు. గ్రామ పంచాయతీ సమావేశాలు చెట్ల కిందనే నిర్వహిస్తున్నాం. ఫారెస్టుకు చెందిన ఒక్క గదిని అద్దెకు తీసుకొని అందులో రిజిస్టర్లు ఉంచాము. ఐటీడీఏ శాఖ అధికారులకు ఫోన్లు చేస్తే బిల్లులు వస్తలేవు మేము ఎం చేయాలని అంటున్నారు. గ్రామానికి అధికారులు ఎన్నో సార్లు వస్తున్నా గ్రామ పంచాయతీ భవనం పనులు పట్టించుకుంట లేరు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మా గ్రామాన్ని ఇటీవల పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం నిత్యం ఏదో ఒక శాఖకు చెందిన అధికారులు వస్తున్నారు. వాళ్లకు నిలబడుదామంటే నీడ లేదు. మండుటెండలో దినమంత చెట్లకింద ఉండి పనులు చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల పట్టించుకొని గ్రామపంచాయతీ పనులను జరిగేలా చూడాలి.