సీసీసీ నస్పూర్, జూలై 31 : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని, గోదావరి నదిపై తెలంగాణ హక్కులు కాపాడాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆగస్టు 1న నస్పూర్‌లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నాయకులు, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరుకానున్నారు. ప్రధాన వక్తలుగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, నీటి పారుదల నిపుణుడు వీ ప్రకాశ్ వ్యవహరించనున్నారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్వీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.