చెన్నూర్, సెప్టెంబర్ 23: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చెన్నూర్ నియోజకవర్గ స్థాయి నాయకుడు రాజా రమేశ్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే వివేక్ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అధికారులను సైతం బెదిరిస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్న అక్రమ కేసుల గురించి ఆయనకు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని, హామీల అమలులో వైఫ ల్యం చెందిందనే విషయం ప్రజలకు స్పష్టం గా అర్థమైందన్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు ఓటు రూపంలో ప్రజలే బద్ధి చెబుతారని, అప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని కేటీఆర్ సూచించారు. మాజీ విప్ బాల్క సుమన్ రెండు మూడు రోజుల్లో జిల్లాకు వచ్చి ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై నాయకులు, కార్యర్తలతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహాలను రచించనున్నారు.