తెలంగాణ రాష్ర్టాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శ్వేత పత్రం’లోని డొల్లతనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఎత్తిచూపారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చమటోడ్చి, రక్తాన్ని చిందించి.. అధికారులు, నాయకులు కష్టపడి చేసిన అభివృద్ధిని కండ్లకు కడుతూనే.. చేసిన ఖర్చు.. తద్వారా పెరిగిన సంపద సృష్టిపై ‘స్వేద పత్రం’ విడుదల చేశారు. చేసిన అప్పు ఎంత.. పెట్టిన పెట్టుబడి ఎంత.. అనే లెక్కలను సమగ్రంగా వివరిస్తూ తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించాలని కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తేటతెల్లం చేశారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో రూ.50 లక్షల కోట్లపైనే సంపద సృష్టించిన తీరు తెన్నులను తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కండ్లకు కట్టినట్టు చూపించారు.
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి ‘స్వేద పత్రం’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విపులంగా వివరించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో చనాక- కొరాట బరాజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ చేశామన్నారు.
కావాలంటే కొబ్బరికాయ కొట్టి మీరే చేసినట్లు చెప్పుకున్నా తమకు అభ్యంతరం లేదంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్ర్తాలు సంధించారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు పడిన ఇబ్బందులు, నాలుగు జిల్లాలుగా ఏర్పడ్డాక మెడికల్ కాలేజీలు, చేరువైన పాలన గురించి ప్రస్తావించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.25 కోట్లతో కుమ్రం భీం స్మారక చిహ్నం, మ్యూజియం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ద్వితీయ నగరాలకు ఐటీ విస్తరించామని చెప్తూ ఆదిలాబాద్‌లోని ఐటీ హబ్ ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఆదివాసీ, గిరిజన సంక్షేమం, పోడు పట్టాల పంపిణీ, కొత్త పంచాయతీల ఏర్పాటు ఇలా అన్ని జిల్లాల్లో చేసిన అభివృద్ధికి ‘స్వేద పత్రం’లో అద్దం పట్టారు.
పెన్‌గంగ నదిపై నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న చనాక-కొరాట బరాజ్ నిర్మాణాన్ని కేసీఆర్ సర్కారు పూర్తి చేసి, ఇటీవలే ట్రయన్ రన్ కూడా విజయవంతం చేసిందన్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో గల 89 గ్రామాల పరిధిలోని 52 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ దళపతి కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర సీఎం, మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారన్నారు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణానికి రెండు రాష్ర్టాలు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గల జైనథ్ మండలం కొరాట వద్ద నిర్మించే బరాజ్, ప్రధాన కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.451.46 కోట్లు మంజూరు చేసిందన్నారు. పంప్‌హౌస్ నిర్మాణ పనులకు రూ.118.92 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం విస్తృత పర్చడానికి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మావల మండలంలోని బట్టిసవర్గాంలో గల సర్వే నంబరు 72లో మూడెకరాల స్థలంలో రూ.40 కోట్లతో టవర్ నిర్మాణాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. పనులు కూడా కొనసాగుతున్నాయని, టీఎస్ఐఐసీ అధికారులు పర్యవేక్షించారని చెప్పారు. 50 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణమవుతుండగా.. 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు.