కాగజ్‌నగర్, జూన్ 23: సిర్పూర్ నియోజకవర్గంలోని రైతులను అటవీ చట్టాల పేరుతో ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని అంకుసాపూర్ గ్రామానికి చెందిన రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములను దున్నేందుకు వెళ్లగా వారిని అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఈ సమస్యను ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన వెంటనే స్పందించి రైతులతో కలిసి కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్‌ను కలిసి మాట్లాడారు. అంకుసాపూర్ గ్రామస్తులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని, వారు కేవలం తిండి కోసం వర్షాకాలంలోనే పంట వేసి బతుకుతారని చెప్పారు. లేదంటే వారు బతకడం కష్టమని ఎఫ్‌డీవో దృష్టికి తీసుకెళ్లారు. అటవీ చట్టాల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఎఫ్‌డీవో సానుకూలంగా స్పందించి, గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిషరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్ ఈఎస్ఐ దవాఖానను సందర్శించారు. వసతులపై రోగులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. బీఆర్ఎస్ సిర్పూర్ మండల కన్వీనర్ అస్లాం అనారోగ్యంతో సిర్పూర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతుండడంతో విషయం తెలుసుకొని పరామర్శించారు. ప్రభుత్వ దవాఖానలో కరెంట్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
జనరేటర్ ఉన్నా పనిచేయడం లేదని, కరెంట్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు తప్పడం లేదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కరెంట్ కోతల ప్రభుత్వమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాం రావు, మాజీ కౌన్సిలర్ నక మనోహర్, నాయకులు కాశిపాక రాజు, మహిళా నాయకురాలు వరలక్ష్మి, కమల తదితరులు ఉన్నారు.