కాగజ్‌నగర్, ఏప్రిల్ 15 : సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసినిలోని తన నివాసంలో పేపర్ మిల్లు కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్పీఎంలో స్థానికులను ఓ రకంగా, స్థానికేతరులను మరో రకంగా చూస్తున్నారని, దేశమంతా ఒక న్యాయమైతే.. సిర్పూర్ నియోజకవర్గానికో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఎస్పీఎం యాజమాన్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హకుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
ఉద్యోగుల క్వార్టర్స్‌కు కనీసం నీటి సరఫరా చేయడం లేదన్నారు. సెలవులు తగ్గించారని, ఫింఛన్లు ఇవ్వడం లేదని, ఇంక్రిమెంట్లు అమలు చేయడంలేదని, పంచ్ కూడా పని చేసే చోట పెట్టలేదని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే కంపెనీ క్వార్టర్స్‌లో పార్టీ ఆఫీస్ పెట్టి నడుపుతున్నారని, ఆయన కార్మికుల తరుపున మాట్లాడే ధైర్యం చేయడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప తన కాంట్రాక్టులు, కమీషన్ల కోసం యాజమాన్యంతో కుమ్మకై కార్మికుల సంక్షేమాన్ని మరిచారన్నారు. తనకు లారీలు లేవని, కర్ర, నీరు, పేపర్లలో తనకు వాటాగానీ.. కాంట్రాక్టు గానీ అవసరం లేదని, కేవలం కార్మికుల సంతోషమే ముఖ్యమన్నారు. కంపెనీ బాగుండాలి.. కార్మికులు కూడా బాగుండాలని కోరారు.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చి కంపెనీని తెరిపించిన ఘనత బీఆర్ఎస్దేనని కొనియాడారు. 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒప్పందంతో పేపర్ మిల్లు పున:ప్రారంభమైందని, కానీ, ప్రస్తుతం 60 శాతం కూడా స్థానికులు లేరన్నారు. స్థానికులకు పని రాదని, సోమరులని యాజమాన్యం అవమానపరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని పేరొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలంతా బాధపడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేరని, ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదని, అలాగే మిల్లు యాజమాన్యం కార్మికుల భవిష్యత్ కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, బీఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్, అంబాల ఓదెలు, మోయిన్, కన్నయ్య, నాగులయ్య, తన్నీరు పోషం, మిల్లు కార్మికులు పాల్గొన్నారు.