కాగజ్‌నగర్ రూరల్/కౌటాల, జనవరి 4 : ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట 13 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న మున్సిపల్ కార్మికుల గోస పట్టదా ? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కార్మికుల జీతాల కోసం కార్మికులు చేస్తున్న ధర్నా ఆదివారంతో 14వ రోజుకు చేరుకున్నది. శనివారం రాత్రి మున్సిపాలిటీ కార్మికులకు మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్మికులతో పాటు మున్సిపల్ కార్యాలయంలోనే పడుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో నిత్యం పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా పనులు, ఇతర అనేక రకాల పనులు చేసే కార్మికులకు 5 నెలలుగా జీతాలివ్వకుండా ఇంత లా ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులకు జీతాలివ్వడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడమేమిటని ప్రశ్నించారు. కార్మికులు సమ్మె చేస్తూ ఇబ్బంది పడుతుంటే స్థానిక ఎమ్మెల్యే హరీశ్ దర్జాగా అసెంబ్లీలో నిద్రిస్తున్నాడని మండిపడ్డారు. ఇందుకు నిరసన గా తాము కార్మికులకు మద్దతుగా స మ్మె శిబిరంలో నిద్రించినట్లు తెలిపా రు. గతేడాది మున్సిపల్ కార్మికుడు లింగంపల్లి నాగేశ్ వినాయక నిమజ్జనంలో చనిపోతే ఇప్పటి వరకు ఆ కుటుంబానికి ఎలాంటి పరిహారం అందలేదని తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తానని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
చర్చలు విఫలం..సమ్మె కొనసాగింపు
ఆదివారం కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా , ఎమ్మెల్సీ దండే విఠల్, మున్సిపల్ అధికారులతో కార్మికులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగించనున్నట్లు కార్మికులు తెలిపారు.