కాగజ్‌నగర్, ఆగష్టు 25 : తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద, ఒకరు నెట్టుకుంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మార్చిలో ముందస్తుగా బఫర్ స్టాక్ తెచ్చుకోకుండా రేవంత్ సరార్ ఏం చేసిందని ప్రశ్నించారు. సిర్పూర్ నియోజకవర్గంలో 50 శాతం యూరియా పంపిణీ పెండింగ్‌లో ఉందని, రైతులు ఇబ్బందులు పడుతుంటే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ పట్టించుకోకుండా డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. పాల్వాయి హరీశ్‌బాబు ధర్నా చేస్తూ, రైతుల ముందు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, అన్ని మండలాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలన్నీ బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు.
40 ఏళ్లుగా నియోజకవర్గాన్ని దోచుకున్న వారికి సిర్పూర్లో స్థానం లేదని, పార్టీని మోసం చేసి ఇతర పార్టీల్లో చేరి.. తిరిగి బీఆర్ఎస్లోకి వస్తే చేర్చుకునేందుకు అధిష్టానం సిద్ధంగా లేదన్నారు. సిర్పూర్ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 45 వేల మంది తనకు మద్దతుగా నిలిచారని, వారిని విడిచి ఎకడికీ వెళ్లేది లేదని స్పష్టం చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలోని నౌగం బస్తీకి చెందిన యువకులు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, బీఆర్ఎస్ నాయకులు కొంగ సత్యనారాయణ, మహ్మద్ మిన్హాజ్, పార్వతి అంజన్న, వరలక్ష్మి, కమల పాల్గొన్నారు.