మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) : వరంగల్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూ.. వాడలన్నీ కదిలాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ జెండాలు ఆవిష్కరించి, వాహనాలను ప్రారంభించగా ఎల్కతుర్తి వైపునకు సాగాయి. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దండులా తరలివచ్చి జై తెలంగాణ.. జైజై కేసీఆర్.. నినాదాలతో హోరెత్తించగా దారులన్నీ మారుమోగాయి. ఎటు చూసినా గులాబీ జెండాలే దర్శనమిచ్చాయి. ఇక టీవీలకు అతుక్కుపోయిన సబ్బండవర్గాలు ఆద్యాంతం అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నాయి.
ఆదిలాబాద్ నుంచి దండులా..
ఆదిలాబాద్ జిల్లా నుంచి 45 డిగ్రీల సెల్సియస్కుపైగా ఎండలను సైతం లెక్క చేయకుండా తమ ప్రియతమ నాయకుడు కేసీఆర్ ప్రసంగాన్ని వినడానికి రెట్టించిన ఉత్సాహంతో వరంగల్ బాట పట్టారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి బయలుదేరే వాహనాలను మాజీ మంత్రి జోగు రామన్న జెండా ఊపి ప్రారంభించారు.
బతుకమ్మలతో మహిళలు తరలిరాగా రామన్న బతుకమ్మను ఎత్తుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బోథ్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో వాహనాల్లో గులాబీ పార్టీ శ్రేణులు బయలుదేరాయి. స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేశా రు. వందలాది వాహనాలతో జాతీయ రహదారిపై నుంచి వరంగల్ వైపు కదిలిలారు. ఉదయం గ్రామాల్లో గులాబీ జెండాలను ఎగురవేశారు. వరంగల్ సభకు వెళ్లే గులాబీ శ్రేణులతో గ్రామా లు పండుగ వాతావరణాన్ని తలిపించాయి.
నిర్మల్ నలువైపుల నుంచి..
నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలోని గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మాజీ జడ్పీ చైర్మన్ కొరిపెల్లి విజయలక్ష్మి, నిర్మల్ బీఆర్ఎస్ ఇన్చార్జి రాంకిషన్రెడ్డిలు జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. అంతకుముం దు పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. రజతోత్సవ సభకు తరలిన వారిలో మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాం సుందర్ ఉన్నారు.
భైంసా పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్లో ముథోల్ నియోజకవర్గ సమన్వయ సమి తి సభ్యుడు విలాస్ గాదేవార్ జెండాను ఎగురవేశారు. రాహుల్ నగర్లో ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ జెండాను ఆవిష్కరించారు. రజతోత్సవ సభకు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ సంఖ్యలో నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు.
ముం దుగా గాంధీనగర్లోని క్యాంపు కార్యాల యం నుంచి వాహనాలను జాన్సన్ నాయ క్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి జగన్నాథ్చౌరస్తా వరకు రెండు కిలో మీటర్ల పొడవు తో ర్యాలీగా వెళ్లారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ పథకాన్ని ఆవిష్కరించారు.