భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్లీనరీలను నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి.. ప్రతినిధుల సభపై ప్రత్యేకంగా చర్చించారు. చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రాలు గులాబీమయ మయ్యాయి. సభా ప్రాంగణాలు ముస్తాబు కాగా.. రహదారులు, ప్రధాన కూడళ్లు జెండాలతో కళకళలాడుతున్నాయి. కొన్నిచోట్ల చెట్లకు రంగులు వేయించడం, వాల్ పెయింటింగ్ కూడా చేశారు. ఒక్కో సభకు మూడు వేల మందికిపైగా హాజరుకానుండగా.. భోజనానికి ముందు పది, తర్వాత పది తీర్మానాలు ఆమోదించుకున్న తర్వాత సభలు ముగియనున్నాయి.
– మంచిర్యాల, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల ప్రతినిధి, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ) ః ఈ నెల 27వ తేదీన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊరూ-వాడా ముస్తాబయ్యాయి. నియోజకవర్గ, మండల కేంద్రాలతోపాటు ప్రతి పల్లె గులాబీ మయమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నేడు(మంగళవారం) పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నారు. ఒక్కో సభకు మూడు వేల మంది వచ్చేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే బీఆర్ఎస్ జెండాలు ఎగురవేసి, నియోజకవర్గ సమావేశానికి తరలివెళ్లనున్నారు. ఇందుకోసం కొన్ని రోజుల ముందు నుంచే ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో రోడ్ల వెంట, ప్రధాన కూడళ్లలో జెండాలు ఏర్పాటు చేయడంతోపాటు చెట్లకు రంగులు వేయించడం, వాల్ పెయింటింగ్ పనులు ఇప్పటికే పూర్తి చేశారు. చెన్నూర్ నియోజవర్గంలో నెల రోజుల ముందే జెండాల ఏర్పాటు, వాల్ పెయింటింగ్ పూర్తయ్యింది. ప్రతి గ్రామంలో ఓ అతిపెద్ద బీఆర్ఎస్ జెండా ఏర్పాటు చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించినా మంగళవారం నాటి ప్రతినిధుల సభపై ప్రత్యేకంగా చర్చించారు. రానున్న మూడు రోజులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
ఒక్కో దగ్గర 20కిపైగా తీర్మానాలు
ఒక్కో నియోజకవర్గంలో గడిచిన తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిపై 15-20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, వైద్యం, విద్య, గిరిజన సంక్షేమం, దళితుల సంక్షేమం, వెనుబడిన వర్గాల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి ఇలా ఒక్కో అంశాన్ని సభలో ఒకరు తీర్మానం ప్రవేశ పెడుతారు. అనంతరం దాన్ని మరొకరు బలపరిస్తే సభ చప్పట్లలో వాటిని ఆమోదిస్తుంది. ఇప్పటికే తీర్మానం ప్రవేశపెట్టేవారు, బలపరిచే వారి లిస్ట్ తయారైపోయింది. సభలో పాల్గొనాల్సిన ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించారు. ప్రతి ఒక్కరికీ ఫోన్లలో మెస్సేజ్‌లు పంపించారు. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే పూర్తయిన మండలాల నుంచి ఎక్కువ మందిని సభలకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రత్యేక మెనును సిద్ధం చేయించారు. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చేపల కూర, బగార అన్నం, తెల్ల అన్నం, వెజ్ బిర్యానీ, ఏవైనా మూడు వెజ్ కర్రీలు, సాంబార్, ఐస్‌క్రీమ్, గులాబ్ జామ్, జిలేబీ, పెరుగు వంటి రకాల కర్రీస్‌తో భోజనం ఏర్పాటు చేయనున్నారు. భోజనానికి ముందు పది తీర్మానాలు, అనంతరం పది తీర్మానాలను ఆమోదించుకున్న తర్వాత సభలు ముగియనున్నాయి.
Trs