బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాజకీయ కుట్రలో భాగంగానే ఆమెను అరెస్టు చేశారంటూ మండిపడుతున్నారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్ట్ చేయబోమని సుప్రీం కోర్టుకు మాట ఇచ్చి… ఇప్పుడెలా తప్పుతున్నారని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రోజే అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నయని, ఇది అప్రజాస్వామికం, అనైతికం, అక్రమమని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆసిఫాబాద్, మార్చి 15 : ఎమ్మెల్సీ కవితపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు ఈడీ ఇతర సంస్థలను అడ్డుపెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నది. మొదట తనిఖీల కోసం అని చెప్పి వచ్చి.. అప్పటికప్పుడే అరెస్టు చేయడం వెనుక ఏదో కుట్ర దాగి ఉన్నట్లే అనిపిస్తున్నది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేయడం సరికాదు.
ఆసిఫాబాద్, మార్చి 15 : బీజేపీ కావాలనే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నది. తనిఖీల కోసమని వచ్చి.. ఆ వెంటనే అరెస్టు చేయడాన్ని బట్టి చూస్తే కచ్చితంగా ఏదో కక్షసాధింపు చర్యలాగే కనిపిస్తున్నది. కేంద్రంలో అధికారం ఉందని కవితను అరెస్ట్ చేయించేందుకు ఈడీపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు అనిపిస్తున్నది. ఇది అప్రజాస్వామికం. బాధాకరం. ఎన్నికుట్రలు చేసినా బీజేపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు.
మంచిర్యాలటౌన్, మార్చి 15 : కేవలం రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. ఏడాదిన్నర కిందటే లిక్కర్ స్కాంలో కేవలం సాక్షిగా మాత్రమే పేరును చేర్చారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే తనిఖీల పేరుతో వచ్చి అరెస్టు చేయడం సరికాదు. శనివారం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా మోదీ సర్కారు సాగిస్తున్న అరాచకంగానే దీనిని భావిస్తున్నాం. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మోదీ సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదు.
మంచిర్యాలటౌన్, మార్చి 15: ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అరెస్టు అప్రజాస్వామికం. ముందుగా ఇంట్లో తనిఖీలు అని చెప్పి వచ్చిన ఈడీ అధికారులు సాయంత్రానికి అరెస్టు వారెంటు జారీ చేయడం వెనుక పెద్ద రాజకీయ కుట్రకోణం దాగి ఉన్నట్లుగానే భావిస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందురోజు అరెస్టు చేయడం వెనుక ఆంతర్యమేమిటి. మహిళ అని కూడా చూడకుండా రాత్రిపూట అరెస్టు చేయడం శోచనీయం. తెలంగాణ సమాజమంతా కవితక్కకు మద్దతుగా నిలుస్తుంది. ఆమె నిర్దోషిగా బయటకు వస్తారన్న నమ్మకం ఉంది.