మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు ఎలాంటి కష్టాలు రాలేదని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు సర్కారు మారిన తర్వాత మళ్లీ రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయయని, 13 నెలల్లోనే ఊహించని విధంగా దాదాపు 400కు పైగా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తీవ్ర ఆవేదన చెందారు.
రైతులు ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని, మాట నిలబెట్టుకోలేని సర్కారును నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని జిల్లాల రైతాంగానికి బీఆర్ఎస్ తరుఫున భరోసా ఉంటామని చెప్పారు. రైతు ఆత్మహత్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యయన కమిటీ సభ్యులు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారి పర్యటించారు. నేరడిగొండ, బేల మండలాల్లో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని దశల వారీగా అద్భుతంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. సాగునీటికి, కరంట్‌కు ఇబ్బంది లేకుండా పెట్టుబడిని సమకూర్చి, పంటలు కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించారని చెప్పారు. కరెంట్ కష్టాలు వస్తాయని, రుణమాఫీ కాక రైతులు రోడ్లెక్కుతారని, ఆత్మహత్యలు చేసుకుంటారని ఎవరూ ఊహించలేదని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న రైతులు కాంగ్రెస్ పాలనలో ఆందోళనతో కూడిన జీవితాన్ని గడపాల్సి దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. కరెంట్ వచ్చేది.. పెట్టుబడి వచ్చేది.. రుణమాఫీ అయ్యేది.. బోనస్ వచ్చేది.. పంట కొనుగోళ్లు చేపట్టేది.. ఇలా దేనికీ నమ్మకం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కారు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి రైతుల్లో ఉండే ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు సమయానికి అందకపోవడం వల్లే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. రూ. 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని, ఏ గ్రామానికి పోయినా రుణమాఫీ కాలేదని చెప్పే వారే ఎక్కువగా కనిపిస్తున్నారన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లయితే రైతు జాదవ్ దేవరావ్ చనిపోయేవాడు కాదన్నారు.
ఈ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. రుణమాఫీ, రైతు భరోసా అందక తీవ్ర ఇకట్లు పడుతూ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతతో విసుగెత్తిన రైతులకు భరోసా కల్పించి.. ధైర్యం నింపడమే అధ్యయన కమిటీ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ, విదేశాలకు తిరిగే బదులు క్షేత్రస్థాయిలో రైతులను పట్టించుకోవాలన్నారు.
ఈ ప్రభుత్వానికి స్వయం నిర్దేశిత లక్ష్యం లేదు. ఎటువైపు పోవాలనే గమ్యం లేదు. ఏం చేయాలనే దిశానిర్దేశం లేదు. అందుకే ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్నరు. మరోవైపు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుం డా చేసిన్రు. ఇలా ఏ వర్గం ప్రజలు కూడా ఈ రోజు తెలంగాణలో సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదు.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
కేసీఆర్ హయాంలో దేశంలో అనేక రాష్ర్టాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. తెలంగాణలో మాత్రం రైతు ఆత్మహత్యలు క్రమంగా తగ్గినయి. ఈ విషయాన్ని మోదీ సర్కారే పార్లమెంట్లో ప్రకటించింది. రైతులు బతకడానికి కేసీఆర్ దారి చూపించారు. కరెంట్.. నీళ్లు.. పెట్టుబడి సాయం ఇచ్చి, పంటలకు మార్కెట్ ధర, రైతు బీమా.. పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు ఇలా అన్నీ ఇచ్చి తెలంగాణలో ఉండే ఏ కుటుంబానికైనా చేయూతనందించే పరిస్థితిని కేసీఆర్ హయాంలో చూశాం. కానీ, ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కంటతడి పెట్టని కుటుంబం లేదు.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నరు. కేసీఆర్ కంటికిరెప్పలా కాపాడుకున్నరు. కానీ, కాంగ్రెస్ 13 నెలల పాలనలో రైతులు ఆగమవుతున్నరు. సకాలంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ కాక అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గిరిజన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిజన బిడ్డల ఉసురు తగులుతది. రైతుల కోసం ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. 2 లక్షలపైన రుణం ఉంటే ఇవ్వమని మోసం చేయడం సరికాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు బీఆర్ఎస్ అండగా ఉన్నది. మీ కోసం ప్రభుత్వంతో పోరాడుతుంది.
– సత్యవతి రాథోడ్, అధ్యయన కమిటీ సభ్యురాలు
బీఆర్ఎస్ పాలనలో ఎవుసం పండుగలా సాగింది. రైతులు సంతోషంగా ఉన్నరు. తెలంగాణ ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మారింది. కానీ, కేసీఆర్ తెచ్చిన పథకాల కంటే రెండింతలు తెస్తామని చెప్పి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు రైతులను మోసం చేస్తున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. 2 లక్షల రుణమాఫీ హామీని విస్మరించింది. ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయాన్ని ఎగ్గొట్టింది. పంటల కొనుగోళ్లలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులను సైతం మోసం చేస్తున్నది. రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. కనీసం బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సైతం ప్రభుత్వానికి ధైర్యం రావడం లేదు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా స్పందన లేదు. ఇదేం ప్రభుత్వం? రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మీ తరుపున మేం ప్రభుత్వంతో పోరాడుతం. ఎవరూ అధైర్య పడొద్దు. మీకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కేసీఆర్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ కాని వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తం.
– జోగు రామన్న, అధ్యయన కమిటీ సభ్యుడు
కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. రైతుల బలవన్మరణాలు కలచివేస్తున్నయి. బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుంది. రైతులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షలు బ్యాంకులకు పోయి లోన్ తెచ్చుకోవాలని రైతులకు చెప్పి మోసం చేసిండు. రైతు భరోసా 15వేలు ఇస్తామని 12వేలే అంటున్నడు. రైతులెవరూ ధైర్యం కోల్పోవద్దు. మీకు మేమున్నం.
– రసమయి బాలకిషన్, అధ్యయన కమిటీ సభ్యుడు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నరు. పదేళ్లలో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్, రుణమాఫీ, పంటల కొనుగోళ్లతో రైతులకు అండగా నిలిచిండు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలో వచ్చి రైతులు, పేదలను మోసం చేస్తున్నది. ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను సైతం అమలు చేయడం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. బోథ్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటం. ఆత్మహత్య చేసుకున్న రైతు ఆడే గజానంద్‌కు సొంత డబ్బులు లక్ష సాయం అందిస్తున్న. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. త్వరలో రాష్ర్టానికి మంచి రోజులు వస్తయి. రైతులు ధైర్యంగా ఉండాలి. మీ తరఫున అసెంబ్లీలో కొట్లాడుతం.
– అనిల్‌జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
తప్పకుండా రైతులకు బాసటగా ఉంటం. అన్నదాతకు అండగా ఉంటూనే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తం. ఎన్ని బెదిరింపులు చేసినా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటం. ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేయాలి. లేనిపక్షంలో ప్రజాపోరాటం తప్పదు. ఇది చెప్పడానికే ఈ పర్యటనను చేపట్టినం.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అధ్యయన కమిటీ చైర్మన్