ఆదిలాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభానికి సంబంధించి జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు దామోదరరావు, మాజీ మంత్రులు జోగు రామన్న, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు సీసీఐ సాధన కమిటీ సభ్యులు ఢిల్లీలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిశారు. మూతబడిన సీసీఐని ప్రారంభించాలని వినతిపత్రం అందించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీసీఐని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ పరిశ్రమ ల శాఖ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్న కేంద్ర మంత్రులను కలిసి పరిశ్రమకు ప్రారంభానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని సూచించినట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీసీఐని ప్రా రంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి హన్స్‌రాజ్ గంగా రాం కూడా పరిశ్రమను సందర్శించి ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు గుర్తు చేశారు. పరిశ్రమ ప్రారంభానికి ఎన్నో రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నాయని, వేలాది మందికి ఉపాధి కల్పిం చే సీసీఐని తెరిపిస్తే జిల్లా అభివృద్ధితోపాటు దేశంలో సిమెంటు రంగానికి డిమాండ్ ఉన్నందున పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ నాయకుల అభ్యర్థన మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి కుమారస్వామి తనకు కొంత సమయం ఇవ్వాలని, పరిశ్రమ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో-కన్వీనర్ విజ్జిగిరి నారాయణ, అరుణ్‌కుమార్, నగేశ్, పోశెట్టి, రమేశ్, జగన్, దేవేందర్, నారాయణ, ఆశన్న, మనోజ్ ఉన్నారు.