చెన్నూర్/రామకృష్ణాపూర్, ఏప్రిల్ 29 : అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని, మా పార్టీతోనే అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే ఓదెలుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ రామకృష్ణాపూర్ పట్టణాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని, గడిచిన నాలుగున్నరేండ్లలో రూ. 203.50 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న క్యాతన్పల్లిని మున్సిపాలిటీగా మార్చుకొని ప్రగతిబాట పట్టించామని తెలిపారు. నిరుపేదల కోసం పట్టణంలో 286 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని, మరో మూడు నెలల్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అర్హులైన వారికి అందజేస్తామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరిట ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. రాబోయే నాలుగు నెలల్లో గాంధారి వనంలో హైదరాబాద్ తరహాలో శిల్పారామాన్ని నిర్మిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న 4000 మందికి పట్టాలు పంపిణీ చేశామని, ఈ ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. మిగిలిన వారు దరఖాస్తు చేసుకునేందుకు మరో మూడు నెలలు గడువు ఇచ్చామని చెప్పారు. రాబోయేది ఎన్నికల సంవత్సరమని, గంగిరెద్దుల వాళ్లలాగా వచ్చే వాళ్లని చూసి ఆగం కావద్దని సూచించారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేసే కుట్రలు చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
సింగరేణిలో ఆదాయపు పన్ను రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేయకుండా తొక్కిపెట్టారని మండిపడ్డారు. సింగరేణి.. తెలంగాణకు పేగుబంధంలాంటిదని, బొగ్గు గనులు ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుకునే బాధ్యత సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదేనని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ చేసిందేమీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ. 400 ఉన్న గ్యాస్ ధరను రూ. 1200కు పెంచిందని, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుడిపై ఆర్థిక భారం మోపిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
Adilabad3
లక్ష మెజార్టీతో సుమన్ గెలుపు ఖాయం : మంత్రి కొప్పుల ఈశ్వర్
నాయకుల ఆలోచనలు బాగుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు మేలు చేకూరుతుందని, ఇందుకు ఉదాహరణే మన సీఎం కేసీఆర్, విప్ బాల్క సుమన్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ఒక్క రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలో రూ. 203.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం మామూలు విషయం కాదన్నారు. ఒక్క రామకృష్ణాపూర్కే ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకు వచ్చారంటే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు రూ. వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టి ఉంటారన్నారు. విప్ బాల్క సుమన్.. సీఎం కేసీఆర్‌కు ప్రియ శిష్యుడని, గత ఎన్నికల సమయంలో సుమన్ నా కొడుకుతో సమానమని చెప్పిన విషయం గుర్తు చేశారు. కేసీఆర్ ఆశీస్సులు ఉన్న నాయకుడు దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని చెప్పారు.
నియోకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న విప్ బాల్క సుమన్‌పై పోటీ చేసే దమ్మున్న నాయకుడే లేడని, వచ్చే ఎన్నికల్లో బాల్క సుమన్ లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థను అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ వస్తున్నదని, అందులో భాగంగా లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్‌పరమైతే రిజర్వేషన్లు రద్దవుతాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు.
కేసీఆర్‌తోనే ప్రగతి టీబీజీకేఎస్ వర్గింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్‌పరం చేస్తూ రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. అత్యున్నత స్థానంలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్‌షా స్వయంగా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారని, విధ్వంసం సృష్టించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దీనిని తెలంగాణ సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. సింగరేణిని కాపాడేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఆందోళనలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్లో కౌన్సిలర్ల చేరిక
రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 10వ వార్డు పనాస రాజు, సీపీఐకి చెందిన 16వ వార్డు కౌన్సిలర్ మేకల తిరుమల, నాయకుడు కట్ల రమేశ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, మున్సిపల్ కౌన్సిలర్, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్ల నడుమ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ బాల్క సుమన్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సభాస్థలి వద్ద తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించారు. మంత్రి, విప్ స్థానిక సూపర్ బజార్ ఏరియాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.