MLA Anil Jadav | ఆదిలాబాద్ : ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భాస్కర్ మృతదేహానికి ఆయన సొంత గ్రామం బోథ్ మండలం పొచ్చర గ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్ డెడ్‌బాడీకి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కర్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
బోథ్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన మైలారపు ఆడేళ్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక బహుజనులను పొట్టనపెట్టుకోవడం సరికాదని, వారితో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఆడేళ్లు కుటుంబానికి ప్రభుత్వం తరపున సహాయం అందేలా నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొట్లాడి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. వీరి వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డితో పాటు ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.