భీమారం, ఫిబ్రవరి 9 : ‘శాసన సభ ఎన్నికల సమయంలో జైపూర్ ఎస్టీపీపీలో 40 వేల మందికి ఉద్యోగాలు పెట్టిస్తా అంటివి. ఇప్పుడు ఏమైంది. గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసెత్తడం లేదు. మాయమాటలు చెప్పి నియోజకవర్గ ప్రజలను మోసం చేసినవ్’ అంటూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్ ఎమ్మెల్యే వివేక్‌పై ఫైర్ అయ్యారు. ఆదివారం భీమారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్లతో పాటు డైరీలను ఆవిష్కరించి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వివేక్ భీమారానికి, నియోజక వర్గానికి ఏం చేశాడని ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారని ప్రశ్నించారు.
భీమారంలో 138 సర్వే నంబర్లో క్రీడా మైదానం పేరిట నీ కార్యకర్తలు మొరం అమ్మారని, ఇప్పుడు ఆ మైదానాన్ని చూడడానికి ఎలా వస్తావని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో శ్రీకాంతాచారి క్రీడా మైదానానికి భూమి కేటాయిస్తే, కనీసం దాని అభివృద్ధికి రూపాయి కూడా ఇచ్చింది లేదన్నారు. కోతుల నివారణకు భీమారం ప్రజలు రూ. 3 లక్షలు జమ చేసి ఇచ్చారని, ఆ సమస్యపై నిలదీస్తే రూ. 2 లక్షలు ఇస్తానని చెప్పి.. ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రజలను మోసం చేశావని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి మధునయ్య, నాయకులు వేముల ప్రణీత్ గౌడ్, చిం తల తిరుపతి, గుడిమల్ల నరహరి, దుర్గం రమేశ్, డోంగ్రి రా జలింగు, వడ్ల కొండ పవన్, బబ్లు, సోదారి మల్లేశ్, రాజన్న, యువ నాయకులు దాసరి మణిదీపక్ పాల్గొన్నారు.