బెజ్జూర్, మార్చి 26 : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ అంశంపై సర్కారు, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు అసెంబ్లీలో నోరు మెదపకపోవడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. బుధవారం బెజ్జూర్ మండలం కుకుడ, మర్తిడి, పాపన్‌పేట, గబ్బాయి, తలాయి, సోమిని, మొగవెళ్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రేవంత్ సర్కారు, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌బాబు సిర్పూర్ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
రేవంత్‌రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారని, ఏ ఒక్క గ్యారంటీ అమలు చేసింది లేదని మండిపడ్డారు. 500ల గ్యాస్ రావడం లేదని, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఉత్తమాటే అని చెప్పారు. రైతు భరోసా అందక.. రుణమాఫీ రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇందిరమ్మ ఇండ్ల ఊసే లేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సర్కారులో రైతులు రంది లేకంట వ్యవసాయం చేసుకున్నారని, ఇప్పుడు వారిలో చిరునవ్వు మాయమైందని తెలిపారు.
అందుకే ప్రజలంతా మళ్లీ బీఆర్ఎస్ సర్కారే రావాలని కోరుకుంటున్నారని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తామని నమ్మకంగా హామీ ఇస్తున్నారన్నారు. ఆర్ఎస్పీ వాయిస్‌పై అసెంబ్లీలో కొంత స్పందన వచ్చిందని, పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతున్నదన్నారు. కుకుడలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఆత్రం హరీశ్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు ఆర్ఎస్పీ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఆర్ఎస్పీ కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కన్వీనర్ లెండుగురి శ్యాంరావు, యూత్ కన్వీనర్ కాసిపాక రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మొహమ్మద్ ఖాజా మోహినుద్దీన్, మండల అధ్యక్షుడు బూస సారయ్య, యూత్ మండల అధ్యక్షుడు దుర్గం తిరుపతి, కొండయ్య, ఆబీద్ ఖాన్, షంషొద్దీన్ బాబు పాల్గొన్నారు.