మంచిర్యాల టౌన్, నవంబర్ 15 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తయిన పనులకు పిలిచిన టెండర్లు వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కలెక్టర్‌కు రాసిన వినతిపత్రాన్ని శనివారం స్థానిక కలెక్టరేట్ ఏవోకు బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు తన వినతిపత్రంలో రాసిన అంశాలను బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు.
మంచిర్యాల కార్పొరేషన్‌గా ఏర్పడినప్పటి నుంచి నియమ, నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా రాజకీయ జోక్యంతో, టెండర్లు లేకుండా నాణ్యత లేని పనులు చేస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత రాజకీయ ఒత్తిడితో టెండర్లు పిలుస్తున్నారని వారు పేర్కొన్నారు. బైపాస్‌రోడ్డులో కేవలం మూడు ఇండ్లు మాత్రమే ఉండగా, అక్కడ రోడ్డు, డ్రైనేజీల పనులకు టెండర్లు పిలిచారని, కానీ ఆ పనులు పూర్తయ్యాయని తెలిపారు.
టెండర్లకు సరిపడా సమయం ఇవ్వకుండా వారికి కావాల్సిన వ్యక్తులకే పనులు దక్కేలా చేస్తున్నారని, అత్యవసర పనులు గానీ, ముందస్తు ప్రత్యేక అనుమతులు గానీ తీసుకోకుండా పనులు చేపట్టి వాటికి టెండర్లు పిలవడం సరికాదన్నారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, ఇదిచట్టరీత్యా నేరమని, వెంటనే టెండర్లు రద్దుచేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందించిన వారిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంక నరేశ్, తోట తిరుపతి, శ్రీపతివాసు, ఎడ్ల శంకర్ ఉన్నారు.
టెండర్లు రద్దు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే పూర్తయిన, పూర్తి కావస్తున్న పనులకు టెండర్లు పిలువగా, ఈ విషయమై ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’లో ‘పూర్తవుతున్న పనులకు టెండర్లా..?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు అధికారులు స్పందించారు. జనరల్‌ఫండ్ నిధులతో రెండు పనులకు పిలిచిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ సంపత్‌కుమార్ తెలిపారు. పలు ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతానికి టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.