రామకృష్ణాపూర్/మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 5 : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను క్యాతనపల్లిలో గృహ నిర్బంధం చేశారు. ఆదివారం ఆయన నివాసంలో మందమర్రి సీఐ పర్స రమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న తనను ఉదయమే గృహ నిర్బంధం చేయడంపై బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలుస్తుందన్నారు. ఇక మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పట్టణ ఎస్ఐ తిరుపతి నేతృత్వంలో పోలీసులు దివాకర్‌రావు నివాసానికి చేరుకుని ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రె స్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని మండిపడ్డారు. న్యాయం కోసం ప్రజల తరపున పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలంతా బీఆర్ఎస్కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ గూండాల దాడి సిగ్గుమాలిన చర్య : మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 5 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివా రం మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడం సరికాదని, బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో కేసీఆర్ ఫొటో పెట్టాలని ఏనాడూ ప్రయత్నాలు చేయలేదని, అది బీఆర్ఎస్ నాయకులకు ఉన్న నిబద్ధత, మంచిపేరు అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందన్న అహంతో, మదమెక్కినట్లు వ్యవహరిస్తున్నారని, వీరికి త్వరలోనే తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.

ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 5 : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఖానాపూర్‌కు వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఖానాపూర్ ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేసినప్పటికీ పోలీసులు మొండిగా ఆమెను హౌస్ అరెస్ట్ చేసి ఇంటి ముందు పహారా కాశారు. ఇక జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి ఆమెను ఎసార్ట్ వాహనంతో తీసుకెళ్లారు. కలెక్టరేట్ వద్ద సైతం భారీగా పోలీసులను మోహరించారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని అని, స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్బంధించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు.
బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్
చెన్నూర్ టౌన్, ఏప్రిల్ 5 : చెన్నూర్‌లో బీఆర్ఎస్వీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా గుమిగూడి ప్రజా సౌకర్యాలకు ఆటంకం కలిగించారని, పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి దిష్టిబొమ్మ దహనం చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు నినాదాలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొన్నారు. దీంతో బడికెల శ్రావణ్, ఎండీ నాయబ్, కొప్పుల రవీందర్, రేణుకుంట్ల శ్రీనివాస్, తుంగపిండి నవీన్, చిలుముల సంపత్, సార్ల శివ, తగరం మహేందర్‌పై చేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.