మందమర్రి, జనవరి 20 : పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన, కూడళ్లలో రాజకీయ పార్టీలు, వ్యాపారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రమాదకరంగా మారాయని, వాటిని వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక పాత బస్టాండ్, జయశంకర్ చౌరస్తాలో జాతీయ రహదారి ఫ్లైఓవర్ పైన, మూల మలుపుల వద్ద, కోల్‌బెల్ట్ రహదారి వద్ద, ఆర్వోబీ వంతెన, సింగరేణి గ్రీన్ పార్క్ వద్ద ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
చివరకు మినీ ట్యాంకు బండ్ అందాలు కనిపించకుండా చేశారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి కూడా గండి పడుతోందని చెప్పారు. ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు రాజశేఖర్, కొంగల తిరుపతి రెడ్డి, ఎండీ.అబ్బాస్, బండారు సూరిబాబు, బోరిగం వెంకటేశ్, భూపెల్లి కనకయ్య, వేల్పుల కిరణ్, బర్ల సదానందం, ముస్తఫా, భట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, పల్లె నర్సింగ్, పూసాల ఓదెలు, బెల్లం అశోక్, అఖిలేశ్పాండే, శేఖర్, సోషల్ మీడియా ఇన్చార్జి సీపెల్లి సాగర్ పాల్గొన్నారు.