సింగరేణి సంస్థ టెండర్లలో ‘సైట్ విజిట్’ విధానం తీసుకురావడంపై బీఆర్ఎస్, టీబీజీకేఎస్‌లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు బుధవారం మంచిర్యాల జిల్లాలోని బొగ్గు బావులు, జీఎం కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలతో హోరెత్తించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి టెండర్లలో పాల్గొనేందుకు కొత్త నిబంధనలు తీసుకురావడం సరికాదని, టెండర్లలో జరిగిన దోపిడీపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఆపై అధికారులకు వినతి పత్రాలు అందించాయి.
బెల్లంపల్లి, జనవరి 21 : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ టెండర్లలో సైట్ విజిట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి సంస్థ నిబంధనలు మార్చి, తన బావమరిదికి రూ. 1600 కోట్ల టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. గతంలో సింగరేణిపై ఏ ప్రభుత్వం కూడా ఆజమాయిషీ చేయలేదని, రేవంత్ సరార్ మాత్రం సంస్థను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సమీప బంధువు పాత్ర ప్రధానంగా ఉన్న సింగరేణి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి టెండర్లలో పాల్గొనడానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానం సింగరేణి చరిత్రలో ఎప్పుడూ లేదని మండిపడ్డారు. నైని బొగ్గు టెండర్లలో సైట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తక్కువ ధరలకు ఖరారైన టెండర్లను రద్దు చేసి, కొత్త విధానంలో అధిక ధరలకు కాంటాక్టులను కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు, ఉద్యోగులు నిరసన చేపట్టారు. అనంతరం అకడి నుంచి ర్యాలీగా తరలి వెళ్లి గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు బడికల రమేశ్, గని పిట్ కార్యదర్శి హనుమంతరావు, నాయకులు కలాలి నరసయ్య, ఎరుకుల సుందర్ రావు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నైనీ బ్లాక్ సింగరేణి టెండర్లలో జరిగిన అవినీతి, అక్రమాలను వ్యతిరేకిస్తూ, సైట్ విజిట్ విధానాన్ని ఎత్తివేసి పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ఎదుట రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేశ్‌తో కలిసి ధర్నా చేశారు. అనంతరం జీఎంకు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు బ్లాకులు దక్కించుకోవడానికి సైట్ విజిట్ విధానం అమలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ బామ్మర్ది, తమ్ముళ్లకు చెందిన సంస్థలకు టెండర్లు అప్పగించే కుట్రలు చేస్తున్నారన్నారు. సింగరేణి టెండర్లలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో మైనస్ టెండర్లు లేకుండా కుమ్మక్కై 10 నుంచి 15 శాతం అదనపు టెండర్లు కొనసాగిస్తున్నారన్నారు.
డీజిల్ విధానంలో మార్పు చేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేస్తున్నారన్నారు. సంస్థ రూ. లక్షకు రూ. 10 నుంచి రూ. 15 వేల దాకా నష్టపోతుందన్నారు. సింగరేణి నిధులతో ఫుట్ బాల్ క్రీడలు జరిపిన ముఖ్యమంత్రి, సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. కేసీఆర్, బీఆర్ఎస్, బొగ్గు గాని కార్మిక సంఘం మాత్రమే సింగరేణి సంస్థకు, కార్మికులకు శ్రీరామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అకురి సుబ్బయ్య, టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్‌రెడ్డి, ఏరియా కార్యదర్శులు గడ్డం మహిపాల్‌రెడ్డి, తొంగల రమేశ్, గొర్ల సంతోష్, ఉత్తేజ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులు హైమద్, గౌస్, ఎర్రయ్య, రఫీఖ్, దుర్గాప్రసాద్, తిప్పని తిరుపతి, తిరుమల్, జయపాల్, రుకుం తిరుమల్, రాజ్‌కుమార్, చేరాలు, పెర్క సత్తయ్య, రాజేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్, పడాల మాదవి శ్రీనివాస్, దుర్గాప్రసాద్, పెర్క సత్తయ్య, జనార్దన్, గుంట జగ్గయ్య, మల్లెత్తుల రాజేంద్రపాణి, నర్సయ్య పాల్గొన్నారు.
కాసిపేట, జనవరి 21 : సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ బెల్లం అశోక్, పిట్ కార్యదర్శి బైరి శంకర్ డిమాండ్ చేశారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ గని మేనేజర్ దేవరకండ సతీశ్‌కు వినతిపత్రం అందించారు. బెల్లం అశోక్, బైరి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలను తక్షణమే రాబట్టాలని డిమాండ్ చేశారు. ఇక టెండర్లలో జరిగిన దోపిడీపై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 ఇైంక్లెన్ గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గని ఇన్చార్జి మేనేజర్ రవి శంకర్‌కు వినతిపత్రం అందించారు. ఆయాచోట్ల టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు వెంకట రాజం, అఫ్జలొద్దీన్, తోకల రమేశ్, బండారి రమేశ్, యువ నాయకుడు బెల్లం అరుణ్, రామునూరి రాజేశ్, జాడి శివ, పాటి వెంకట స్వామి, షారూక్, సింగతి రాజేందర్, రవికాంత్, ఇంబ్రహన్, ఎరుగురాల నాగరాజు, రాజయ్య, రాజ్ కుమార్, సతీశ్, వెంకటేశ్, కృష్ణ, కుమార్, శ్రవణ్, యాదగిరి, పోశం పాల్గొన్నారు.
మందమర్రి, జనవరి 31 : సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ పేరిట సింగరేణి సంస్థను దోచుకునేందకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు కుట్ర పన్నుతున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ ఆరోపించారు. సైట్ విజిటింగ్ విధానాన్ని రద్దు చేయాలని, సింగరేణి టెండర్లలో జరిగిన దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సింగరేణి మందమర్రి ఏరియాలోని అన్ని గనులు, విభాగాలపై టీబీజీకేఎస్ నాయకులు నట్టబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆపై అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సంపత్ మాట్లాడుతూ టెండర్ల దోపిడీకి సంబంధం ఉన్న ప్రతి ఒక్క అధికారిని, కాంగ్రెస్ పెద్దలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోలిండియాలో ఎక్కడా లేని సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ సింగరేణిలో ఎందుకని వారు ప్రశ్నించారు. దీని ద్వారా కాంట్రాక్టర్లను మభ్యపెట్టి రింగ్‌గా ఏర్పడి సింగరేణిని దోచుకోవలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ఈశ్వర్, వీరారెడ్డి, తాళ్లపల్లి సారయ్య, మధుసూధన్ రెడ్డి, బొడ్డు మల్లేశ్, శివనాయక్, తోట శ్రీనివాస్, శంభు, సాయికృష్ణ పాల్గొన్నారు.
సైట్ విజట్ విధానం ఎత్తివేయాలి
శ్రీరాంపూర్, జనవరి 16 : సింగరేణిలో అవినీతి, అక్రమాలకు అవకాశముండేలా తీసుకొచ్చిన సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఆన్లైన్ విధానంలోనే టెండర్లు నిర్వహించాలి. దోపిడీకి సంబంధం ఉన్న ప్రతీ అధికారిని శిక్షించాలి. సీబీఐచే విచారణ జరిపించాలి. అదనంగా వేసిన టెండర్లను రద్దు చేయాలి. కాంట్రాక్టర్లకు లబ్ధి చేసే విధానాలు అమలు చేయరాదు.
-పానుగంటి సత్తయ్య కేంద్ర కార్యదర్శి టీబీజీకేఎస్
సింగరేణికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలి
శ్రీరాంపూర్, జనవరి 16 : సింగరేణికి విద్యుత్ సంస్థల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 48 వేలకోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలి. రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్‌లను ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి సింగరేణిని కాపాడాలి. టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి. సంస్థలో రాజకీయ జోక్యం ఉండరాదు.
-తొంగల రమేశ్, టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శి