కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు చేయడంపై నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాలు, చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీ ముందు ఏర్పాటు చేయడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తీసుకువచ్చిన తెలంగాణను, ఇన్ని రోజులు కాపాడుకున్న సంస్కృతిని కనుమరుగు చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ తల్లి రూపాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పితీరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విలువ తెలియని, తెలంగాణ సంస్కృతి, చరిత్రపై అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు పాలన కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంస్కృతిని గౌరవిస్తూ ప్రతి బతుకమ్మ పండుగకూ మహిళలకు చీరెలను కేసీఆర్ పంపిణీ చేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిపై దృష్టిసారించకుండా నిరంతరం కేసీఆర్‌ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినంత మాత్రాన తెలంగాణ చరిత్రను మార్చలేరన్నారు. ఇప్పటికైనా తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడి ఆపాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరి వెంకటేశ్వర్లు, నాయకులు గంధం శ్రీనివాస్, భీమేశ్, రవి, సాజిద్ అన్సార్ హైమద్, నిసార్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూర్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. పెంచికల్పేట్ మండల కేంద్రంలో తెలంగాణతల్లి చిత్రపటానికి అసెంబ్లీ కో కన్వీనర్, సమన్వయ కర్త కొండ రాంప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు బిట్టి శ్రీనివాస్, నాయకులు పాలాభిషేకం చేశారు.
తెలంగాణ ప్రజలను అవమానించారు
– మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 10: తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కాంగ్రెస్‌పార్టీ అవమానించిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. మంగళవారం మంచిర్యాలలోని హమాలీవాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు బతుకమ్మను చేతిలో నుంచి తీసేశారని, ఒక చెయ్యిని హస్తం గుర్తు పోలిన విధంగా ఉంచారని, కిరీటం, సిరిసంపదలు అనేవి కనబడకుండా పేదరాలిగా తీర్చిదిద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ దీక్షతో తెలంగాణ వచ్చిందనేది జగమెరిగిన సత్యమని తెలిపారు.
చెన్నూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు ‘కాంగ్రెస్ తల్లి వద్దురా….తెలంగాణ తల్లి ముద్దురా..’అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జన్నారం మండల కేంద్రంలోని పొనకల్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు పాలాభిషేకం చేశారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
Adilabad3