మంచిర్యాలటౌన్, మార్చి 10 : మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీటాకీసు చౌరస్తా వరకు కేసీఆర్ సర్కారులో రూ. నాలుగు కోట్లతో నిర్మించిన నాలుగు జంక్షన్లను కుదింపు పేరిట కూల్చివేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నలిచిపోగా, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆయన తనయుడు విజిత్రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను రాస్తారోకో విరమించాల్సిందిగా పట్టణ సీఐ ప్రమోద్‌రావు కోరారు.
ఇందుకు వారు నిరాకరించడంతో పోలీసులంతా వారిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు-పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై నుంచి ఎలాగైనా వారిని తొలగించాలని పోలీసులు, అసలు కదిలేదు లేదని బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న ఐడీపార్టీ కానిస్టేబుల్ లక్ష్మణ్ రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజిత్‌రావును బలవంతంగా లాగేందుకు యత్నించాడు. దీంతో అసలు ఇతను ఎవరంటూ విజిత్‌రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు కానిస్టేబుల్ లక్ష్మణ్‌ను పట్టుకుని పోలీసులకు పట్టించాలని ప్రయత్నించారు. కాసేపు వాదోపవాదాలు జరిగాయి.
చివరకు అక్కడున్న పోలీసులు అతను ఐడీ పార్టీ కానిస్టేబుల్ అని తెలిపారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఇందులోకి ఎలా వస్తాడని, అసలు ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉన్న క్రమంలో అనుమానించాల్సి వస్తుందని విజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఒకవైపు, విజిత్‌రావు మరోవైపు తమ శ్రేణులతో కలిసి దూసుకువెళ్లడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం రాస్తారోకో విరమించిన బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులను స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ కావాలనే కూల్చివేస్తున్నాడని, ఆయన గెలిచినప్పటి నుంచి ఎన్ని ప్రమాదాలు జరిగాయో లెక్క తీయాలని సవాల్ విసిరారు.
అంబేద్కర్ చౌరస్తాలో చుట్టూ రాజ్యాంగానికి సంబంధించిన చిహ్నాలు, రాజ్యాంగ పుస్తకం, జాతీయ జెండాలోని చిహ్నం, తదితర లోగోలను రెయిలింగ్‌లో పొందుపరిచామని అన్నారు. వాటిని కూడా ఇష్టారాజ్యంగా జేసీబీతో కూల్చివేస్తున్నారని అన్నారు. దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ జంక్షన్‌ను కూల్చుతుంటే అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రోడ్డు వెడల్పు పనులకు తాము వ్యతిరేకం కాదని, కానీ గతంలో చేసిన అభివృద్ధి పనులను ధ్వంసం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, ఐసీడీడిఎస్ మాజీ ఆర్గనైజర్ అత్తి సరోజ, అన్నపూర్ణ, గాదెసత్యం, అంకం నరేశ్, తోట తిరుపతి, శ్రీపతి వాసు, ఎర్రం తిరుపతి, మందపల్లి శ్రీనివాస్, అక్కూరి సుబ్బయ్య, మొగిలి శ్రీనివాస్, కాటంరాజు, తాజుద్దీన్, పెంట ప్రదీప్, రమేశ్యదవ్, మధు, తదితరులు పాల్గొన్నారు.