కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/నమస్తే బృందం, ఏప్రిల్ 27 : కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. శ్రేణులు ఊరూరా సంబురాలు నిర్వహించాయి. బీఆర్ఎస్ కార్యాలయాలు, ప్రధాన చౌరస్తాల్లో పార్టీ అధ్యక్షులు, నాయకులు గులాబీ జెండాలు ఎగరేసి.. జై తెలంగాణ.. జై కేసీఆర్.. జైజై కేటీఆర్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలోని తెలంగాణతల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పూలమాల వేశారు.
అనంతరం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని, అహోరాత్రులు కష్టపడి పనిచేసి తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిపారని గుర్తు చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ గొడిశెల సంధ్యారాణి-రాజారమేశ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. చెన్నూర్ పట్టణంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు జెండా ఆవిష్కరించి, వేడుకలు నిర్వహించారు. ఆయాచోట్ల గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనకయాదవరావు, సీనియర్ రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.