మంచిర్యాల, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు 420 హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చి 420 రోజులైనా వాటిని అమలు చేయడం లేదు. ఓ మహాత్మా.. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు. ఈ దద్దమ్మ పార్టీకి దారి చూపించు.. హామీలు నెరవేర్చేలా బుద్ధిని ప్రసాదించు’ అంటూ బీఆర్ఎస్ నాయకులు గురువారం జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు వినతి పత్రాలు అందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలోకి తొక్కిందని విమర్శించారు.
కల్యాణ లక్ష్మి.. తులం బంగారం, నాలుగు వేల పింఛన్, రూ.15 వేల రైతు భరోసా ఇలా.. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఏ ఊరికి వెళ్లినా రైతులు రుణమాఫీ కాలేదనే చెబుతున్నారన్నారు. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసే, కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే జనవరి 26న పథకాలు ప్రారంభించారని, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినందుకే పథకాలు ఆగిపోయాయని ప్రచారం చేస్తూ ఓట్లు దండుకోవడానికి, మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఏడా ది అసమర్థ పాలనను నిరసిస్తూ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చామన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసినా.. ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లిలోని పాత జీఎం కార్యాలయ మూలమలుపు వద్ద మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, చెన్నూర్ పట్టణంలోని గాంధీ చౌక్‌లో నియోజకవర్గ ఇన్చార్జి రాజారమేశ్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు, నిర్మల్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము గాంధీజీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చారు.