హాజీపూర్, మే 23 : రానున్న ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లి గ్రామ శివారులోని మంచిర్యాల గార్డెన్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరంతర అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలని, అందుకు పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్కారు చేపడుతున్న ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. హనుమంతుడి గుడిలేని గ్రామం లేదు, ప్రభుత్వ పథకం అందని ఇల్లులేదని చెప్పుకొచ్చారు. ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు.
నిరుపేదలకు మెరుగైన విద్య, వైద్యం కోసం ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అనంతరం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మెడికల్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటును అడ్డుకున్నది కాంగ్రెస్, బీజేపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు గోతికాడి నక్కల్లా కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాడుకున్నారని చెప్పుకొచ్చారు. దేశం మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తుందని, ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తున్నదన్నారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాలలో రౌడీలు, గుండాలకు తావు లేదన్నారు. తెలంగాణ శాంతిగా ఉండడం ఇష్టం లేని కొంత మంది కుల, మత పిచ్చి రాజకీయ వాదులు అలజడులు సృష్టించాలని చూస్తున్నారని, అలాంటి వారిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. జిల్లాలో నిర్మించే మెడికల్ కళాశాలకు పెట్టే ప్రతి రూపాయీ తెలంగాణదేనన్నారు.
ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలను చేస్తున్నారని, అలాంటి వారికి యువత తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు దుర్మార్గమైన పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడో వార్డు సభ్యుడు తిరుపతి తన అనుచరులు 20 మందితో కలసి బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం గులాబీమయమైంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్ ఆధ్వర్వంలో జరిగిన సమావేశంలో మండల అధ్యక్షురాలు మందపెల్లి స్వర్ణలత, గ్రామ సర్పంచ్ ఓలపు శారదతో పాటు వైస్ ఎంపీపీ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల యువత అధ్యక్షులు పాల్గొన్నారు.