ఆదిలాబాద్, మే 3(నమస్తే తెలంగాణ) ః జిల్లా వ్యాప్తంగా పలు మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం జొన్నల కొనుగోళ్లను ప్రారంభించి, మద్దతు ధర క్వింటాలుకు రూ.3,371 చొప్పున సేకరిస్తున్నది. అక్రమాలకు అవకాశం లేకుండా కొనుగోళ్లు జరపాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర రూ.3,371 ఉండగా రూ.2,500లకు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.12 లక్షల ఎకరాల్లో పంట సాగవగా.. ఎకరాకు 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు పంట సేకరణ పరిమితి విధించగా.. మిగిలిన జొన్నలను రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కౌలు రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్మే అవకాశం లేకపోవడం, పట్టాలు లేని భూములున్న రైతులు, క్రాప్ బుకింగ్ జరగని వారు దళారులకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకున్నది.
దళారుల అక్రమ దందా షురూ..
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కువగా ఉండడంతో దళారులు అక్రమ దందాకు తెర లేపారు. ఇచ్చోడ మండలంలోని మాదాపూర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 258 క్వింటాళ్లు, ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్‌లో అక్రమంగా తరలిస్తున్న 45 క్వింటాళ్ల జొన్నలను అధికారులు పట్టుకున్నారు. దళారులు గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాల్లో తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తారు. సాగు చేయని రైతులను గుర్తించి వారి పట్టాలు తీసుకుని విక్రయించి క్వింటాలుకు రూ.800 వరకు లాభం పొందుతారు. జిల్లాలో ఇటీవల ముగిసిన పత్తి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. రైతులు సాగు చేయకున్న వ్యాపారులు, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులు ములాఖత్ అయి అక్రమాలకు పాల్పడ్డారు. టెంపరరీ రిజిస్ట్రేషన్ పత్రాల జారీ వ్యవహారంలో ఆదిలాబాద్ మార్కెటింగ్ కార్యదర్శి మధూకర్, ఇచ్చోడ వ్యవసాయశాఖ అధికారిని సస్పెండ్ చేశారు.
అధికారుల పర్యవేక్షణ లోపం
జొన్నల కొనుగోళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపం కనపడుతున్నది. టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ కమిటీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా కమిటీలు కనిపించడం లేదు. కౌలు, గిరిజన రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్న దళారులు అక్రమంగా ఇతర రైతుల వద్ద నుంచి పట్టాలు తీసుకుని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. జొన్నల కొనుగోళ్లలో జిల్లా ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టి అసలైన రైతులు నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉంది.
– సంగెం బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక, జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్