మంచిర్యాల, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు చేపడుతున్న ఎన్‌హెచ్-63 విస్తరణ పనులకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. స్థానికులు, రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పాటు కొందరు రియల్టర్లు, భూ స్వాములు జోక్యం చేసుకోవడంతో హైవే అలైన్‌మెంట్‌ను ఇప్పటికే మూడుసార్లు మార్చాల్సి వచ్చింది. మూడోసారి మార్చిన ప్రతిపాదనలతో గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతులే.. మరోసారి భూములు కోల్పోవాల్సి వస్తున్నది. ఈ క్రమంలో రైతులు చేసిన విజ్ఞప్తులను ఎన్హెచ్ఏ అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడంతో.. వారు హైకోర్టును ఆశ్రయించగా పనులను నిలిపివేయాలంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.
మూడుసార్లు మార్పు..
ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ వరకు విస్తరించి ఉన్న ఈ రహదారిని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ఫోర్‌లేన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.5354.12 కోట్ల అంచనాతో 160 కిలోమీటర్ల పొడవునా పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అధికారులు మొదటి అలైన్మెంట్ రూపొందించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట శివారులోని పొలాలు, అటవీ ప్రాంతం మీదుగా ముల్కల్ల నుంచి కుర్మపల్లికి ఈ రోడ్డు వచ్చే లా డిజైన్ చేశారు. కానీ.. ఇందుకు స్థానిక రైతులు ఒప్పుకోకపోవడంతో పాటు గ్రీన్ఫీల్డ్లో భూములు కోల్పోతున్న కొందరు భూస్వాములు, రియల్టర్లు ఫైరవీలు చేసి అధికారులపై ఒత్తిడి తేవడంతో.. ఆ అలైన్మెంట్ అర్ధంతరంగా రద్దు అయిపోయిందనే ఆరోపణలు వ చ్చాయి.
సరే రైతుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మొదటి అలైన్‌మెంట్‌ను మార్చి, రెండోసారి రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుం డా ప్రస్తుతమున్న రోడ్డునే బ్రౌన్‌ఫీల్డ్‌గా మార్చడానికి అలైన్మెంట్ తయారు చేశారు. ఈ మేరకు 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్ర స్తుతం ఉన్న రహదారినే విస్తరించాలనేది ఈ ప్రతిపాదన. ఈ క్రమం లో రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు, భూములు కోల్పోయే ప్రజలు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. జనాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు సర్వే పూర్తి చేశారు. దీంతో ఇక బ్రౌన్ ఫీల్డ్ హైవే తప్పదని జనాలు సైతం భావించారు. రోడ్డు పక్కన ఖాళీ స్థలాలు ఉన్నోళ్లు కొత్తగా షెడ్లు నిర్మించి, బోర్లు వేసుకున్నారు. నిర్మాణాలు ఉంటేనైనా సాధారణం కంటే ఎక్కువ పరిహారం వస్తుందనుకున్నారు.
నిపుణులు సైతం బ్రౌన్ ఫీల్డ్ చేస్తే తక్కువ నష్టం ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ లక్షెట్టిపేటలోని కొందరు తమ భూములు, ఇండ్లు కాపాడుకోవడం కోసం బ్రౌన్ ఫీల్డ్‌కు అడ్డుపడ్డారు. బ్రౌన్ఫీల్డ్పై తప్పుడు నివేదిక ఉన్నతాధికారులకు వెళ్లేలా చూశారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఎట్టకేలకు రెండో అలైన్మెంట్ సైతం రద్దు కావాల్సి వచ్చింది. అనంతరం ఎన్హెచ్ఏ అధికారులు లక్షెట్టిపేట మండలం మోదెల నుంచి కుర్మపల్లికి మూడో అలైన్మెంట్ రూపొందించారు. గోదావరి తీరం వెంట 35 కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని భావించి.. ఇందుకోసం మంచిర్యాల జిల్లాలోని 17 గ్రామాల్లో 1433.75 ఎకరాల భూ సేకరణకు సిద్ధమయ్యారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం నుంచి గోదావరి మీదుగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట శివారుగా ముల్కల్ల దాకా మూడో అలైన్మెంట్ ప్లాన్ రెడీ చేశారు.
రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత..
ఇక మూడో అలైన్‌మెంట్‌ను అనుసరించి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, భూములు కోల్పోయే రైతులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై భూములు కోల్పోయే రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి కోసం ఎన్‌హెచ్-63 అలైన్మెంట్ మార్చారంటూ అధికారులను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో కొంత భూములు కోల్పోయామని, ఉన్న కొద్దిపాటి భూమి కూడా ఈ అలైన్మెంట్లో పోతుందంటూ మొరపెట్టుకున్నారు. ఎన్హెచ్ఏ చట్ట ప్రకారం నడుచుకోకుండా, హడావుడిగా నోటీసులు ఇచ్చి భూములు లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆర్డీవో కార్యాలయం ఎదుటే నోటిఫికేషన్‌ను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయినా అధికారులు స్పందించకపోవడంతో హైవేలు, ప్రాజెక్టుల కోసం ఓసారి భూములు కోల్పోయిన వారి నుంచి రెండోసారి భూ సేకరణ చేయడానికి వీల్లేదని.. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా కోర్టుకు వెళ్తామంటూ రైతులు హెచ్చరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద హజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో వేల ఎకరాల సాగు భూములు తీసుకున్నారు. దాదాపు 9 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. వారికి వేరే దగ్గర భూములు, ఇండ్లు పరిహారంగా అందజేశారు. ఇప్పుడు మూడో అలైన్మెంట్లో మళ్లీ అదే గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు. అధికారులు అలైన్మెంట్ మార్చకపోతే కోర్టుకు వెళ్తామని చెప్పినట్లే రైతులు కోర్టును ఆశ్రయించారు. బాధితుల తరఫున న్యాయవాది భూ సేకరణలో నిబంధనలు పాటించడం లేదని, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని చేసిన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. పనులను ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎన్హెచ్ఏ అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.
ఏ ఒక్కరూ కనికరించలేదు
రైతుల కడుపుకొట్టి హైవే నిర్మించడం సరికాదని మొరపెట్టుకున్నా అధికారులు గోడు పట్టించుకోలేదు. ప్రభుత్వాలు సైతం రైతులకు న్యాయం చేయలేకపోయాయి. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మా భూములు ఇచ్చి అన్ని కోల్పోయాం. ఈ విషయం నాయకులు, అధికారులకు చెప్పి వేడుకున్నా ఒక్కరూ కనికరించలేదు. మేము ఒప్పుకోకున్న మా భూములు గుంజుకుంటామని అధికారులు నోటీసులు పంపించారు. నోటీసులు తీసుకోకుంటే ఏకంగా మా ఇంటి గోడలకు అంటించి వెళ్లిపోయారు. కానీ రైతుల పక్షాన న్యాయ దేవత నిలిచింది. రైతుల కన్నీరు చూడలేక న్యాయస్థానం పనులు ఆపేయమని తీర్పు చెప్పింది. ఇందుకు మాకెంతో ఆనందంగా ఉంది.
– ఎంబడి రాజు, రైతు, లక్షెట్టిపేట
ఏడాదిగా కంటిమీద కునుకు లేదు
మా భూములు తీసుకోకండి సారూ అంటూ ఏడాది పాటు తిరగని ఆఫీసు లేదు. నాయకులను కూడా కలిసి గోడు చెప్పుకున్నం. కానీ ఎవరూ ఏం చేయలేక పోయారు. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకున్నారు. పనులు ఆపేందుకు ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం.. మా చేతుల్లో ఏమీ లేదు.. అని చెప్పి తప్పించుకున్నారు. ఎట్టకేలకు న్యాయస్థానం రైతుల పక్షాన నిలిచింది. రైతుల గోడు వినిపించుకొని స్టే ఇచ్చి ఎక్కడికక్కడ పనులు ఆపేసింది. న్యాయస్థానం తీర్పుతో కడుపు నిండా తింటున్నాం.. కంటి నిండా నిద్రపోతున్నాం. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
– కృష్ణ ముకుందా, రైతు, ఇటిక్యాల.