జన్నారం/ఉట్నూర్, జూలై13 : బర్త్‌డే వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు జాదవ్ జైసన్రాజ్(10) మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తొమ్మిదిగుడిసెలపల్లె వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. జన్నారం ఎస్ఐ రాజవర్ధన్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ మండలం కొత్తపెల్లి(చిక్కులగూడెం)కు చెందిన కానిస్టేబుల్ జాదవ్ గోపిచంద్ నార్నూర్ సీఐ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం మంచిర్యాల జిల్లా మందమర్రిలో అతని బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు హాజరై అర్ధరాత్రి ఇంటికి కారులో తిరిగి వస్తుండగా అడ్డుగా వచ్చిన పశువులను తప్పించబోయి చెట్టును ఢీకొన్నాడు.

కారు నుజ్జునుజ్జుకావడంతో అందులో కుమారుడు జైసన్రాజ్ ఇరుక్కపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గోపిచంద్‌తో పాటుగా అతని తల్లి జీజాబాయి, భార్య గీతకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి వారిని మంచిర్యాల దవాఖానకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం హైదరాబాద్‌కు తరలించారు. బాధితుల బంధువు జాదవ్ భాంరావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజవర్ధన్ తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల జిల్లా దవాఖానకు తరలించారు. బాలుడి మృతితో కొత్తపెల్లి గ్రామంలో విషాదం నెలకొన్నది.