ఇచ్చోడ, మార్చి 18 : దేగామ ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న 200 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని బుధవారం అసెంబ్లీలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్‌లో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో నేరడిగొండ మండలంలోని బోరిగామ గ్రామంలో అగ్నిప్రమాదం చో టు చేసుకొని ఇండ్లు మొత్తం నేలమట్టం అయ్యాయన్నారు. బోథ్ మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరత తీర్చాలని కోరారు.
ఆసుపత్రి భవనం పూర్తి కావొస్తోందని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నందుకు ఆగిపోయే పరిస్థితి కనిపిస్తున్నదన్నారు. బోథ్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలన్నారు. ఇచ్చోడలో షాదీఖాన కోసం రూ.3 కోట్లు ఫైనాన్స్ పర్మిషన్ ఇస్తే ముస్లింలకు రంజాన్ తోఫా అందించవచ్చని పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గంలో పండిస్తున్న పత్తి, సోయా రైతులకు సైతం బోనస్ అందించి ఆదుకోవాలని కోరారు.