బోథ్, నవంబర్ 16 : బోథ్‌లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విన్నవించారు. ఇచ్చోడలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. బోథ్‌లో జనరల్ డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్ ఏర్పాటుతో పాటు ఇచ్చోడ, బోథ్‌ను మున్సిపాలిటీలుగా మార్చాలని కోరారు. చిక్మాన్ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి, సాగు నీటి సౌకర్యం పెంచాలని, మథురలను ఎస్టీలో చేర్చాలని విన్నవించారు.
అలాగే ఏజెన్సీ గ్రామాలను రీ షెడ్యూలు చేసి, వెనుకబడిన గిరిజన గ్రామాలను ఏజెన్సీల్లో చేర్చాలని, సిరిచెల్మ మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఇటిక్యాల-పెంబి రోడ్డును పూర్తి చేయించి బోథ్-ఖానాపూర్ నియోజకవర్గాల నడుమ రవాణా సౌకర్యాన్ని మెరుగు పర్చాలని, బరంపూర్-మొర్కండి-బజార్హత్నూర్ రోడ్డు నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయించాలని విన్నవించారు. 2004 నుంచి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి ఉద్యమాల పురిటి గడ్డ అయిన బోథ్.. పార్టీకి అండగా ఉంటున్నదన్నారు.
వెనుకబడిన బోథ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో అనిల్ జాదవ్ చెప్పినవన్నీ నెరవేరుస్తామని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గొడం నగేశ్, బోథ్, ఇచ్చోడ ఎంపీపీలు తుల శ్రీనివాస్, నిమ్మల ప్రీతంరెడ్డి, జడ్పీటీసీలు ఆర్ సంధ్యారాణి, తాటిపెల్లి రాజు, కుమ్రం సుధాకర్, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.